తెలంగాణలో విమోచన దినం గురించి ఏటా వివాదం నడుస్తూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం సెప్టెంబరు వచ్చిందంటే చాలు ఆ నెల 17వ తేదీన విమోచన దినం అధికారికంగా జరపాలనే డిమాండ్లు రాజకీయ పార్టీల నుంచి ఊపందుకుంటాయి. అయితే, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడానికి నిరాకరిస్తున్నారు. నిజానికి గతంలో ఆయనే అధికారికంగా విమోచన దినం జరుపుతామని ప్రకటించి.. ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు.
దీంతో ఏటా సెప్టెంబర్ 17వ తేదీ వచ్చిందంటే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఈ అంశంపైనే చర్చ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అమిత్ షా నిర్మల్ పర్యటన సందర్భంగా విమోచన దినం గురించి గట్టిగా ప్రస్తావించారు. కేసీఆర్ ఎందుకు ఆ వేడుకను జరపడం లేదని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని, తప్పకుండా విమోచన దినాన్ని జరిపి తీరతామని ప్రకటించారు. దీన్ని టీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి ఇష్టం లేని ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలు ఈ నెల 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని, వీరోచిత పోరాటం చేసి అసువులు బాసిన వారికి నివాళులర్పించాలంటూ ట్వీట్ చేశారు. రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న రాష్ట్ర ప్రథమ పౌరురాలు విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలంటూ బహిరంగ ప్రకటన విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
‘‘సెప్టెంబర్ 17 న హైదరాబాద్ విమోచన దినం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. స్వాతంత్య్ర పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని తెలుగులో, ఇంగ్లీషులో కూడా తమిళిసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు.
సెప్టెంబర్ నెల 17వ తేదీని విమోచన దినోత్సవంగా అధికారికంగా జరపాలని బీజేపీ తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నా, మాటలతో రెచ్చగొడుతున్నా సరే టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించడం లేదు. పైగా సంయమనం పాటిస్తోంది. మైనార్టీలను సంతృప్తి పరచడానికి, మజ్లీస్ పార్టీ ఒత్తిడికి తల వంచి రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదన్న విమర్శలు విపరీతంగా చేస్తూ వస్తున్నారు. అయితే, బీజేపీ మతం పేరిట రెచ్చగొట్టే రాజకీయం చేస్తోందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీంతో ఈ ఏడాది ఒక అడుగు ముందుకేసిన బీజేపీ.. ఏకంగా తెలంగాణ విమోచన సభ పేరుతో పెద్ద సభ నిర్వహించి టీఆర్ఎస్‌ను మరింత ఇరుకున పెట్టింది. ఆ సభకు అమిత్ షాను ఆహ్వానించి, విమోచన దినం గురించి గట్టిగా నిలదీయించింది. ఇది టీఆర్ఎస్ నేతలకు మింగుడు పడని విషయమే. ఈ సభలో అమిత్ షా, బండి సంజయ్ చేసిన విమర్శలు, ఆరోపణలపై ఇప్పటిదాకా టీఆర్ఎస్ నేతలు స్పందించలేదు.