తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇంట్లో వాళ్లందరికీ పదవులు ఇచ్చుకొని, దళితులకు సరైన స్థానం కల్పించలేదని మండిపడ్డారు. కేసీఆర్ మనుమడు తినే సన్నబియ్యం వద్దని.. కేసీఆర్ మనుమడు చదివే బడుల్లో దళితులు సైతం చదువుకొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం అయిన గజ్వేల్‌లో రేవంత్ రెడ్డి దళిత, గిరిజన దండోరా సభను నిర్వహించారు. సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.


ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘పేదోడికి విద్యను దూరం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ కదా? మీరే ఆలోచించండి. ఎన్నో ప్రభుత్వ బడులను మూసేయించాడు. బడులు మూసిండు. బార్లు తెరిచిండు. గ్రామాల్లో బెల్టు షాపులు  పెరిగిపోయినయ్. తెలంగాణ రాకముందు మద్యంపై వచ్చిన ఆదాయం రూ.10 వేల కోట్లు అయితే.. తాజాగా రూ.36 వేల కోట్ల ఆదాయం మద్యం అమ్మకాల నుంచి కేసీఆర్ తీసుకుంటున్నడు. ఇప్పుడు 12 ఏళ్ల వచ్చిన ప్రతి వ్యక్తి మందు తాగుతున్నడు.’’


వచ్చే తెలంగాణకు యువకులే బ్రాండ్ అంబాసిడర్లు
‘‘తెల్లారేవరకూ చెప్పినా ఒడవని దు:ఖం ఇవాళ తెలంగాణలో ఉంది. కాబట్టి, రాబోయే 19 నెలలు తెలంగాణ భవిష్యత్తు నిర్ణయించాలి. ఈ తెలంగాణను పట్టి పీడిస్తున్న కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి చేయాల్సి ఉంది. ఈ తుది దశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ విముక్తి కోసం అందరూ పని చేయండి. పని చేసిన వారిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గుర్తుంచుకుంటుంది. వారికి ఐడీ కార్డులు ఇస్తుంది. అందరం ఈ 19 నెలలు పని చేసి సోనియమ్మ రాజ్యం తీసుకొద్దాం. తెలంగాణ ప్రజలు కన్ను తెరిస్తే కేసీఆర్ కాలిపోతడు. ఈ విషయం మీరంతా గుర్తించుకోవాలి.’’


7 గంటలు కేసు నమోదు చేసుకోలేదు
‘‘బాలికపై అత్యాచారం, హత్య జరిగిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే ఏడు గంటల వరకూ పోలీసులు కేసు నమోదు చేసుకోలేదు. చివరికి మంత్రి కేటీఆర్ కూడా ఒక్క ట్వీట్ చేశాడు.. కానీ, పరామర్శించేందుకు కూడా వెళ్లలేదు. చేతగాని దద్దమ్మలు కాబట్టే పోలీసులు నిందితుణ్ని 7 రోజులు అరెస్టు చేయకుండా ఉన్నారు. పసి పాపను చెరిస్తే వారం దాటినా ముఖ్యమంత్రి సమీక్ష జరపలేదు. కానీ, హుజూరాబాద్‌లో ఎలా గెలవాలని రివ్యూలు చేస్తున్నాడు. ఇంతకంటే రాక్షస వ్యక్తి ఉంటారా? దళిత యువకులు, యువతులు ఫీజు రీఎంబర్స్ మెంట్ రాక తల్లిదండ్రులకు భారం అవుతున్నామని చనిపోతే కనీసం వారి గురించి పట్టించుకోలేదు.’’ అని రేవంత్ రెడ్డి మాట్లాడారు.


నిరుద్యోగం కోసం ధర్మయుద్ధం


అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు నిరుద్యోగుల కోసం ధర్మ యుద్ధం చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. పరేడ్ గ్రౌండ్‌లో నిరుద్యోగుల కోసం ధర్మ యుద్ధం చేస్తామని ఆయన ప్రకటించారు. 30 లక్షల మందికి 33 నెలలుగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి బాకీ ఉన్నాడని అన్నారు. కేసీఆర్‌కి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యాపార మెళుకువలను దళిత గిరిజన ప్రజలకు నేర్పాలని అన్నారు.