Atempt to Burial of Women: ఇద్దరు మహిళలను బతికుండగానే మట్టిలో పూడ్డిపెట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో సంచలనంగా మారింది. వారిని శరీరం సగం వరకు మట్టిలో పూడ్చినట్టుగా వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మధ్యప్రదేశ్‌లోని రేవా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. బాధిత మహిళలను మమతా పాండే, ఆశా పాండేగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్‌యాదవ్ దర్యాప్తునకు ఆదేశించారు. నిందితులను కనిపెట్టి వారిని కూడా అదే విధంగా శిక్షించాలని వారిని ఆదేశించారు.
భూ వివాదంగా తేల్చిన పోలీసులు
ఈ ఘటన స్థానికంగా కులాల మధ్య చిచ్చును రగిల్చేలా పరిణమించడంతో పోలీసులు వేగంగా స్పందించి రంగంలోకి దిగి నిందితులను గుర్తించారు. బాధితుల బంధువులు, పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఘటనకు పాల్పడిన నిందితులు ఒకే కులం వారేనని తెలుస్తోంది. ప్రధాన నిందితులను గుర్తించారు. రెండు కుటుంబాలకు మధ్య తలెత్తిన స్థలం వివాదంలో నిందితులు మహిళలను బలవంతంగా మట్టిలో పూడ్చి పెట్టడానికి ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు. దీనిలో కులమతాల ప్రస్తావనే లేదని తేల్చారు. కుటుంబ సమస్యలను కులమతాల వంటి సున్నిత అంశాలకు ముడిపెట్టి దుష్ప్రచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బాధితులు పొలంలో ఉండగా లారీతో మట్టిని తెచ్చి వారి మీద కుమ్మురించినట్టుగా మరికొన్ని వీడియోలు వెలుగుచూశాయి. పొలం పనుల కోసం లారీల్లో మట్టిని తీసుకొచ్చారు. కాగా ఈ పనులను మహిళలు అడ్డగించడంతో నిందితులు ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
నిందితులను అరెస్టు చేశాం: రేవా ఎస్పీ వివేక్ లాల్
ఈ ఘటనపై స్పందించిన రేవా ఎస్పీ మాట్లాడుతూ ఈ ఘటన కుటుంబ భూ వివాదానికి సంబంధించి చోటుచేసుకుందని చెప్పారు. నిందితుల్లో ఇప్పటికే ఒకర్ని అరెస్ట్ చేసి సెక్షన్ 110 BNS ( నేరపూరిత హత్యాయత్నం) కింద కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. మహిళల పరిస్థితి సాధారణంగానే ఉందని వెల్లడించారు. వివరాలను ఎక్స్‌లో వివరించారు.