సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whats App) సరికొత్త అప్డేట్లు తీసుకొచ్చింది. వీడియో కాల్లో పాల్గొనేవారి సంఖ్యను పెంచింది. దీంతో పాటు పలు అదిరే ఫీచర్లు సైతం ప్రవేశపెట్టింది. అవేంటంటే?
కోట్లాది మంది యూజర్లతో ప్రపంచంలోనే టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్. యూజర్ల సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూ తన టాప్ పొజీషన్‌ను నిలబెట్టుకుంటూ వస్తోంది ఆ సంస్థ. తాజాగా ఈ మెసేజింగ్ యాప్‌నకు మరిన్ని మెరుగులు దిద్దింది. 32 మంది యూజర్లతో వీడియో కాల్, ఆడియో స్క్రీన్ షేరింగ్ వంటి ఫీచర్లతో పాటు సరికొత్త స్పీకర్ స్పాట్లైట్ అనే అప్డేట్తో ముందుకొచ్చింది. ఆ విశేషాలేంటో చూద్దాం పదండి.
లేటెస్ట్ అప్డేట్లలో భాగంగా కాలింగ్ ఫీచర్లపై ప్రధానంగా దృష్టిపెట్టింది వాట్సాప్. వీడియో కాల్లో పాల్గొనేవారి పరిమితిని 32కు పెంచింది. ఇదివరకు వాట్సాప్ మొబైల్ డివైజ్‌లో మాత్రమే 32 మందితో వీడియో కాల్ చేసే సౌలభ్యం ఉండేది. ఇకపై విండోస్, మాక్ ఓఎస్ యూజర్లు సైతం 32 మందితో వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. ఇదివరకు విండోస్‌లో వీడియో కాల్ పార్టిసిపెంట్స్ లిమిట్ 16గా ఉండగా.. మాక్ ఓఎస్‌లో ఈ సంఖ్య కేవలం ఎనిమిదిగా ఉండేది.
అయితే, జూమ్, గూగుల్ మీట్ వంటి యాప్‌లు 100 మందితో కాల్స్ చేసుకునే వీలు కల్పిస్తున్నాయి. ఈ యాప్‌లలో ఎంటర్ప్రైజ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారు 500 మందితో వీడియో కాల్లో పాల్గొనవచ్చు. యాపిల్ సంస్థకు చెందిన ఫేస్‌టైమ్.. 32 మందితో వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో చిన్న బృందాలకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతో వాట్సాప్ తాజాగా లిమిట్ పెంచినట్లు తెలుస్తోంది. మార్కెట్లోని పోటీ సంస్థలకు తామేమాత్రం తక్కువ కాదనే మెసేజ్ ఇచ్చింది!
వాయిస్ స్క్రీన్ షేరింగ్
వాట్సాప్ తీసుకొచ్చిన మరో ఫీచర్ వాయిస్ స్క్రీన్ షేరింగ్. గతేడాది వీడియో స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చిన వాట్సాప్.. తాజాగా కేవలం ఆడియోతోనూ స్క్రీన్ షేర్ చేసుకునే వీలు కల్పించేలా తన యాప్‌కు మార్పులు చేసింది. ప్రెసెంటేషన్స్ కోసం వృత్తి నిపుణులకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. అంతేకాకుండా, ఆడియో స్క్రీన్ షేరింగ్ ద్వారా కాల్లో పాల్గొన్న ఇద్దరూ ఒకే వీడియోను తమ తమ స్క్రీన్లపై వీక్షించవచ్చు.
స్పీకర్ స్పాట్లైట్ ఫీచర్
వాట్సాప్ వీడియో కాల్ సమయంలో మాట్లాడుతున్న వ్యక్తిని హైలైట్ చేసి చూపించడమే ఈ ఫీచర్ ప్రధాన ఉద్దేశం. మాట్లాడుతున్న వ్యక్తిని స్క్రీన్‌పై ఫస్ట్ కనిపించేలా చేస్తుందీ స్పాట్లైట్ ఫీచర్. 'ఎక్స్'(ట్విట్టర్)లోని స్పేసెస్ సహా పలు ఆడియో చాట్ యాప్‌లలో ఈ ఫీచర్ ఎప్పటి నుంచో ఉంది.
లో నెట్‌వర్క్‌లోనూ బెస్ట్ కాల్స్!
నెట్వర్క్ సరిగా లేకపోయినా నాణ్యమైన కాల్స్ చేసుకునేందుకు వీలు కల్పించే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్. ఈ మేరకు 'మెటా లో బైట్రేట్' (MLow) అనే ప్రోగ్రామ్‌ను వాట్సాప్‌కు జత చేసింది. యూజర్ల నెట్వర్క్ కనెక్షన్ స్థిరంగా లేకపోయినా, పాత డివైజ్‌లు వాడుతున్నా.. ఈ ఫీచర్ ద్వారా మెరుగైన కాల్స్ చేసుకోవచ్చని వాట్సాప్ తెలిపింది. ఈ MLow ఫీచర్ ఇప్పటికే ఇన్స్టాగ్రామ్, మెసేంజర్‌లో అందుబాటులో ఉంది. తమ ప్లాట్‌ఫామ్స్ అన్నింటిలో ఈ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టాలని మెటా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్‌లో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
Read Also: సూపర్ ఏఐ కెమెరా ఫీచర్లతో వచ్చిన ఒప్పో రెనో 12 5జీ సిరీస్ - కొనాలంటే ఎంత ఖర్చు పెట్టాలి?