Atiq, Ashraf Ahmed Shot Dead:
అర్ధరాత్రి కాల్పులు
యూపీ గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌తో పాటు అతని సోదరుడు అష్రఫ్‌ను అర్ధరాత్రి నడిరోడ్డుపైనే హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ను ఇటీవలే అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రయాగరాజ్‌లో మెడికల్ టెస్ట్‌లు చేయించడానికి తీసుకొచ్చిన సమయంలో ఒక్కసారిగా కాల్పులు జరిపి ఇద్దరినీ హతమార్చారు దుండగులు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతిక్‌ను చంపినందుకు ఎలాంటి రిగ్రెట్ లేదని నిందితులు చెప్పినట్టు సమాచారం. ఈ నేరం చేసినందుకు ఉరి శిక్ష వేసినా సిద్ధమే అని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. తాము చేసిన పని సరైందే అని చాలా గట్టిగా వాదిస్తున్నారట. "హద్దులన్నీ దాటారు. ఇక తట్టుకోలేకపోయాం. అందుకే చంపేశాం" అని చెబుతున్నారు. అయితే ఎవరూ ఈ హత్య చేయించారన్న విషయం మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. మొత్తం ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీళ్లు ముగ్గురూ ఈ హత్యను మతంతో ముడి పెట్టారు.
"మేం చేసింది ధర్మమే. అన్యాయాన్ని అంతం చేశాం. దీనిపై మాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. మమ్మల్ని ఉరి తీస్తారని చెప్పినా నవ్వుకుంటూ లోపలకు వెళ్లిపోతాం. మేం చేయాల్సిన పనిని పూర్తి చేశాం."
- నిందితులు
అగ్రెసివ్‌గా ఉన్నారట..
విచారణలోనూ వీళ్లు పోలీసులతో చాలా అగ్రెసివ్‌గా మాట్లాడినట్టు సమాచారం. ప్రయాగ్‌రాజ్‌లోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిషన్‌లు తీసుకున్న ఈ ముగ్గురు తమ చావునీ లెక్క చేయడం లేదని తెలుస్తోంది. మీడియా ప్రతినిధులుగా వచ్చి దాడి చేసినట్టు పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. ఈ హత్యతో ఒక్కసారిగా యూపీ ఉలిక్కి పడింది. అన్ని జిల్లాల్లోనూ 144 సెక్షన్ అమలు చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దీనిపై స్పెషల్ కమిటీ వేయాలని ఆదేశించారు. పూర్తి స్థాయిలో ఈ ఘటనపై విచారణ జరిపించాలని తేల్చిచెప్పారు.
అసదుద్దీన్ విమర్శలు..
ఉత్తరప్రదేశ్ లో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్ అహ్మద్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. అతీక్, అతడి సోదరుడు దారుణహత్య అనేది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులు, చేతులకు బేడీలు కూడా ఉన్నాయి. అలాంటి వారిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపడం దారుణమైన ఘటన అన్నారు. హత్య చేసిన దుండగులు జైశ్రీరామ్ అని నినాదాలు చేశారని, పోలీసులు మాత్రం నిందితులను ఏ మాత్రం అడ్డుకోకపోవడాన్ని అసదుద్దీన్ తప్పుపట్టారు. ఈ ఘటన యోగి పాలనలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోందని చెప్పడానికి నిదర్శనం అన్నారు. ఎన్ కౌంటర్లు చేస్తే సెలబ్రేట్ చేసుకుంటున్న ఎన్ కౌంటర్ రాజ్యం సైతం హత్య చేయడంతో సమానం అని ట్వీట్ చేశారు.
Also Read: Atiq Ahmed Shot Dead: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు దారుణహత్య - వీడియో వైరల్