Atiq Ahmad Shot Dead Live Video: ఉత్తరప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అరెస్టై జైలులో ఉన్న అతీక్ అహ్మద్ ను మెడికల్ చెకప్ కోసం ప్రయాగ్ రాజ్ లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ మరణించాడు. ఇదే ఘటనలో అతడి సోదరుడు అష్రాఫ్ అహ్మద్ కూడా చనిపోయాడు. మరోవైపు గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ ను పోలీసులు గురువారం ఎన్‌కౌంటర్ చేయడం తెలిసిందే. అసద్ తో పాటు మరో నిందితుడు గుల్హామ్ సైతం ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఝాన్సీలో చేసిన ఎన్‌కౌంటర్ అసద్, గుల్హామ్ చనిపోయారని పోలీసులు గురువారం ప్రకటించారు.
ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడుగా ఉన్న అతీక్ అహ్మద్‌ను ప్రయాగ్‌రాజ్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. అదే సమయంలో గురువారం నాడు అతీక్ కుమారుడు అసద్, మరో నిందితుడు పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. ధూమంగంజ్ పోలీస్ స్టేషన్ లో ఉన్న గ్యాంగ్ స్టర్ అతీక్, అతడి సోదరుడిని మెడికల్ టెస్టుల కోసం ప్రయాగ్ రాజ్ లోని ఓ ఆసుపత్రికి పోలీసులు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ తో పాటు అతడి సోదరుడు అష్రాఫ్ అహ్మద్ మరణించాడని పోలీసులు చెబుతున్నారు.
దుండగులు జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ కాల్పులకు తెగబడ్డారని పీటీఐ రిపోర్ట్ చేసింది. చాలా దగ్గరి నుంచి నిందితులపై కాల్పులు జరిగాయని తెలుస్తోంది. గురువారం ఎన్ కౌంటర్ లో చనిపోయిన అతీక్ కుమారు అసద్ అంత్యక్రియలు శనివారం నిర్వహించారు. కొన్ని గంటల వ్యవధిలోనే గ్యాంగ్ స్టర్ అతీక్ అతడి సోదరుడు దారుణహత్యకు గురికావడం, అందులోనూ పోలీసుల సమక్షంలో పాయింట్ బ్లాంక్ రేంజీలో కాల్పులు జరపడం యూపీలో హాట్ టాపిక్ గా మారింది.
అసలు వివాదం ఏంటంటే..
2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్ ఫిబ్రవరి 24న దారుణ హత్యకు గురయ్యాడు. ఉమేశ్ పాల్ హత్యపై భార్య జయ పాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్, ఇద్దరు కుమారులు, మరికొందరిపై కేసులు నమోదు చేశారు. అతీక్, అష్రాఫ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. అతీక్ కుమారుడు అసద్ ను గురువారం పోలీసులు ఝాన్సీలో ఎన్ కౌంటర్ చేశారు. ఉమేశ్ పాల్ హత్య కేసులో గతంలోనే ఇద్దరు నిందితులు యూపీ పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమయ్యారు.