Ashram School Student Death Due To Food Poison In Asifabad District: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని  (Asifabad District) వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ (16) సోమవారం మృతి చెందింది. గత కొన్ని రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. కాగా, అక్టోబర్ 30న పాఠశాలలో భోజనం చేసిన అనంతరం దాదాపు 60 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విరేచనాలు, వాంతులతో అనారోగ్యానికి గురి కాగా వారందరినీ సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమించడంతో ఈ నెల 5న మెరుగైన వైద్యం కోసం పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు బాలికలు కోలుకోవడంతో వారిని డిశ్చార్జి చేశారు.


వెంటిలేటర్‌పైనే చికిత్స


తొమ్మిదో తరగతి బాలిక సి.శైలజకు వైద్యులు అప్పటి నుంచి వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తూ వచ్చారు. చికిత్సకు శరీరం సహకరించడం లేదని.. పరిస్థితి విషమించడంతో సోమవారం మధ్యాహ్నం బాలిక మృతి చెందినట్లు ప్రకటించారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. శైలజ మృతితో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.


కాగా, పాఠశాలలో ఫుడ్ పాయిజన్ దేని వల్ల జరిగిందనేది ఇంతవరకూ నిర్ధారణ కాలేదని తెలుస్తోంది. ఏది తినడం మూలంగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారనేది ఇంకా తెలియలేదు. ఘటన జరిగిన వెంటనే కలెక్టర్ సహా ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు పాఠశాలను సందర్శించారు. ఘటనపై ఆరా తీశారు. వంటగది, ఆహార పదార్థాలు, టాయిలెట్స్‌ను పరిశీలించారు. విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.


'సర్కార్ నిర్లక్ష్యానికి బలి'


మరోవైపు, శైలజ మృతి పట్ల బీఆర్ఎస్ నేత, మాజీ  మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ నిర్లక్ష్యానికి బలైపోయిన వాంకిడి గిరిజన గురుకుల విద్యార్థిని శైలజకు కన్నీటి నివాళి అర్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు. 'మీ ప్రాణాలు బలి తీసుకున్న పాపం.. ఈ దుర్మార్గపు కాంగ్రెస్‌ను వెంటాడుతది. 25 రోజులుగా నువ్వు వెంటిలేటర్ మీద అనుభవించిన నరకానికి ప్రభుత్వమే జవాబుదారీ. ఆ తల్లిదండ్రులకు గుండె కోతను మిగిల్చిండు సీఎం రేవంత్. తోటి విద్యార్థులతో ఆడుతూ, పాడుతూ బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన ఆ చిన్నారి.. విషాహారం వల్ల కన్నుమూయటం కలిచి వేస్తోంది.






ప్రభుత్వ నిర్లక్ష్యం అభం, శుభం తెలియని గిరిజన బిడ్డకు శాపంగా మారింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. వాంకిడి గురుకులంలో నాణ్యత లేని భోజనం పెట్టడం పాపం కాగా, అస్వస్థతకు గురైన విద్యార్థులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించకపోవడం మరో పాపం. అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. నిమ్స్ ఆసుపత్రిలో బిడ్డను పట్టుకొని అక్కడే ఉన్న ఆ తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడంలోనూ సర్కారు పూర్తి వైఫల్యం చెందింది. చివరకు ఆ అమ్మాయి చావును కూడా దాచి పెట్టాలనే ఉద్దేశంతో, దొంగచాటున మృతదేహాన్ని తరలిస్తుండడం సిగ్గుచేటు. గిరిజన విద్యార్థినీ కుటుంబానికి బాధ్యత వహించి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.' అని హరీష్ పేర్కొన్నారు.


Also Read: KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు