KTR Comments On CM Revanth Reddy: తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక స్థానం ఉందని.. 14 ఏళ్ల కిందట కీలక మలుపునకు కారణమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. లగచర్ల బాధిత రైతులకు మద్దతుగా మహబూబాబాద్‌లో (Mahabubabad) బీఆర్ఎస్  మహాధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ భూములు గుంజుకుంటా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్న కొత్త నియంత రేవంత్‌కు బుద్ధి చెప్పేందుకు అదే మానుకోట సిద్దమైందని అన్నారు. 'కొడంగల్‌లో 9 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు తిరగబడ్డారు. 3 వేల ఎకరాలను గుంజుకోవాలని సీఎం ప్రయత్నిస్తున్నారు. తమ భూములు లాక్కోవద్దని కొడంగల్ రైతులు కోరుతున్నా.. అక్కడి వారి బాధలు వినే తీరిక, ఓపిక సీఎంకు లేదు. ఎక్కే విమానం దిగే విమానం అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి 28 సార్లు ఢిల్లీకి పోయిండు. కనీసం రూ.28 కూడా తీసుకురాలేదు. సొంత నియోజకవర్గంలోనే సీఎంపై ప్రజలు తిరగబడుతున్నారు.' అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.




'అదీ రైతుల పవర్'


'లగచర్లలో దాడి జరిగితే మానుకోటలో ధర్నా ఎందుకని పోలీసులు అంటున్నారు. ఎక్కడ గిరిజన, ఎస్సీ, బీసీ, బడుగు రైతులు ఉంటారో అక్కడ ధర్నా చేస్తాం. ఈ సీఎం అదానీ కోసం పని చేస్తున్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఏడాది పూర్తవుతోంది. వాటిని అమలు చేశారా.?. మొన్న అధికారులు పోతే ప్రజలు నిరసన తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి పోయి ఉంటే ఉరికించి, ఉరికించి కొట్టేవారు. ఢిల్లీలో రైతులు ఏడాది పాటు ఆందోళన చేసి మోదీ లాంటి వ్యక్తినే నల్ల చట్టాల నుంచి వెనక్కి తగ్గేలా చేశారు. రైతుల పవర్ అంటే అలా ఉంటుంది. రైతులతో పెట్టుకున్న ఈ రేవంత్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్పే సమయం వస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించే దాకా వదిలిపెట్టమని చెబుతున్నా. రేవంత్ రెడ్డి వచ్చాక రైతుబంధు ఎగ్గొంట్టిండు. ఫించన్ పెంచలేదు. బోనస్ బోగస్ అయ్యింది. ఆడ బిడ్డలకు మహాలక్ష్మి స్కీం వచ్చిందా?. మహారాష్ట్రకు పోయి కూడా ఆడబిడ్డలను మోసం చేసే ప్రయత్నం చేస్తే అక్కడి ఆడబిడ్డలు బుద్ధి చెప్పారు.' అని కేటీఆర్ మండిపడ్డారు. 


కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసులుండవా?


కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే, పెట్రోల్ పోస్తామంటే భయపడతామా? మేము కేసీఆర్ తయారు చేసిన దళం. భయపడే ప్రసక్తే లేదని కేటీఆర్ అన్నారు. 'లగచర్లలో 30 మంది రైతులను జైల్లో పెడితే మా బంజారా ఆడబిడ్డలు భయపడలేదు. ఎన్‌‌హెచ్ఆర్‌సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళ కమిషన్ సభ్యులకు వాళ్ల బాధలు చెబుతుంటే కమిషన్ సభ్యుల కళ్లలో నీళ్లు వచ్చాయి. లగచర్లలో జరిగినట్లే రాష్ట్రంలో ఎక్కడైనా జరగవచ్చు. ఒక దగ్గర అన్యాయం జరిగితే రాష్ట్రమంతా కదం తొక్కాలి. తెలంగాణలో ఏ గిరిజన బిడ్డ కు అన్యాయైన రాష్ట్రమంతా గిరిజన బిడ్డలు కదం తొక్కాలని కోరుతున్నా. మానుకోట మహాధర్నా మొదటి అడుగు మాత్రమే. మన లగచర్ల గిరిజన మహిళలకు న్యాయం జరిగేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగడుతాం. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు... బంజారా రాష్ట్ర సమితి కూడా. మీకు ఎప్పుడు కష్టమొచ్చినా మేము అండగా ఉంటాం.' అని పేర్కొన్నారు.


Also Read: Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?