Hydra News Update: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ చుట్టూ ఓ వివాదం నడుస్తోంది. బఫర్ జోన్‌లో ఇల్లు కూలుస్తున్న విభాగానికి కమిషనర్‌గా ఆయన ఇల్లే బఫర్ జోన్‌లో ఉందని ప్రచారం నడుస్తోంది. దీనిపై ఆయన స్పందించారు. తన ఇల్లు బఫర్ జోన్‌లో లేదని స్పష్టం చేశారు. 


హైదరాబాద్‌ మధురానగర్‌లో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ ఇల్లు ఉంది. 1980లోనే ఈ ఇల్లు బఫర్ జోన్‌లో ఉందని కొన్ని మీడియా సంస్థలు కథనాలు రాశాయి. దీనిపై రంగనాథ్ స్పందించారు. తన ఇల్లు పూర్తిగా రూల్స్ ప్రకారమే నిర్మించారని ఎలాంటి అతిక్రమణ జరగలేదని తేల్చి చెప్పారు. ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన... జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. 


తనకు వ్యతిరేకంగా నడుస్తున్న ప్రచారంపై కేవలం ప్రకటన మాత్రమే విడుదల చేయకుండా ఇంటికి సంబందించిన మ్యాప్‌లు, ఇతర ఫొటోలను కూడా విడుదల చేశారు. రూల్స్‌ను అతిక్రమించలేదని స్పష్టం చేశారు. 1980 సంవత్సరంలోనే తన తండ్రి ఏపీవీ సుబ్బయ్య ఇల్లు కట్టిరాని పేర్కొన్నారు. అప్పటి నుంచి అంటే దాదాపు 44 సంవత్సరాలుగా అక్కడే ఉంటుంన్నామని వివరించారు. 


రూల్స్ ప్రకారం తను ఉండే ఇంటికి చెరువుకు చాలా దూరం అంటే దాదాపు కిలోమీటర్ దూరంలో ఉందన్నారు రంగనాథ్. అందులోనే పార్క్‌ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఆ పార్క్ కూడా పాతికేళ్ల క్రితమే నిర్మించారని వెల్లడించారు. అది కూడా చాలా దూరంలో ఉందన్నారు. ఈ రెండింటిలో దేని పరిధిలోకి తన ఇల్లు రాదన్నారు రంగనాథ్. 


సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా కొందరు న్యూస్ రాసిన విషయాన్ని రంగనాథ్ ప్రస్తావించారు. ఇలాంటివి ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. దీని ఆధారంగానే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్‌లోనే బక్క జడ్సన్ ఆరోపణలు చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పరిస్థితి తీవ్రమవ్వడంతో రంగనాథ్ రంగంలోకి దిగి స్పందించాల్సి వచ్చింది. 


Also Read: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?


బక్క జడ్సన్ ఆరోపణలు ఏంటీ?
కృష్ణకాంత్ పార్క్ దగ్గరలోఉన్న రంగనాథ్ ఇల్లు చెరువు బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని కాంగ్రెస్ బహిష్కృతనేత బక్క జడ్సన్ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆరోపణలు ఇవిగో అంటూ కీలకాంశాలు వెల్లడించారు. కృష్ణకాంత్ పార్కు ఉన్న ప్రాంతం ఒకప్పుడు పెద్ద చెరువు ఉండేదని తెలిపారు. దాన్ని నాటి చంద్రబాబు ప్రభుత్వం పూడ్చేసి పార్క్ నిర్మించిందన్నారు. తెలంగాణ ఎక్కడైనా చెరువు, పక్కనే కట్టమైసమ్మ ఆలయం ఉంటుందని ఇక్కడ పార్క్‌ దగ్గర కట్టమైసమ్మ గుడి ఉందని తెలిపారు. అక్కడ ఒకప్పుడు చెరువు ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం అన్నారు. 


అధికారులంతా కుమ్మక్కై అక్కడ చెరువు ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డారని బక్క జడ్సన్ ఆరోపించారు. ఇలాంటివి అన్నీ పట్టించుకోకుండా పేదల, మధ్య తరగతుల ఇళ్లు మాత్రమే హైడ్రా పేరుతో కూలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 


Also Read: కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌