Ram Gopal Varma News: దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పరారీలో ఉన్నట్టు ప్రకాశం జిల్లా పోలీసులు అనుమానిస్తున్నారు. రెండుసార్లు విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్టు ఖాయమని గ్రహించిన ఆయన తప్పించుకుని తిరుగుతున్నారని భావిస్తున్నారు. అందుకే ఆయన ఎక్కడ ఉన్నా సరే పట్టుకోవాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు పోలీసులకు అందుకున్న సమాచారం ప్రకారం తమిళనాడులో ఆర్జీవీ ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఆయన్ని అక్కకడే పట్టుకోవాలని చూస్తున్నారు.
తమిళనాడులో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు
తమిళనాడులో ఉన్న ఆర్జీవీ అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నమోదు అయిన కేసుల వివరాలు, కోర్టు తీర్పులను పోలీసులకు తెలియజేశారు. ఈ మేరకు ఆయన అరెస్టుకు సహకరించాలని వారిని కోరబోతున్నారు.
ఆర్జీవీ ఇంట్లోనే విచారణ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్‌లో ఉన్న ఇంటికి వచ్చారు. అప్పటికే ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయారని సిబ్బంది తెలియజేశారు. ఎక్కడికి వెళ్లారని ఆరా తీస్తే తమకు తెలియదని చెప్పారు. అయితే పోలీసులు వారిని విచారించి ఆర్జీవీ ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు.
Also Read: తన గొయ్యి తానే తీసుకున్న జగన్- బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్
సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై వివరణ ఇవ్వాలని విచారణకు రావాలని ఇప్పటికే రెండుసార్లు ఒంగోలు పోలీసులు ఆర్జీవి నోటీసులు జారీ చేశారు. తనకు షూటింగ్ ఉన్నందున విచారణకు హాజరుకాలేనని మొదటి సారి పోలీసులకు సమాధానం చెప్పారు ఆర్జీవి. రెండోసారి నోటీసులు జారీ చేశారు. దాని ప్రకారం ఇవాళ హాజరుకావాల్సి ఉంది. దీంతో ఆయన విచారణకు హాజరుకాకపోవడంతోపాటు మరో రెండు వారాల సమయం కావాలని కోరినట్టు చెబుతున్నారు.
మరింత సమయం అడుగుతున్న ఆర్జీవీ
విచారణకు ఆర్జీవీ మరింత సమయం అడగడంతో పోలీసులు నేరుగా ఆయన ఇంటికి వచ్చారు. ఇలా ఇంటికి రావడంపై ఆర్జీవీ అడ్వకేట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టులో పిటిషన్ల విచారణ పెండింగ్‌లో ఉందని మరో రెండు వారాలు గడువు కూడా కోరామన్నారు. దీనికి సమాధానాలు చెప్పకుండా నేరుగా ఇంటికి రావడమేంటని అంటున్నారు. తాము డిజిటల్ విచారణకు అంటే వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతామని కూడా చెప్పినట్టు వెల్లడించారు. వీటికి అంగీకరించకుండా నేరుగా రావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్జీవీ భయపడుతున్నారా?
రెబల్‌గా ఉంటూ నాకు నచ్చిందే చేస్తా... నచ్చినట్టు బతుకుతా అనే ఓ వర్గానికి డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఇన్‌స్పిరేషన్. భయమనేది తన బ్లడ్‌లోనే లేదు అంటూ చెప్పుకొచ్చే వర్మలో భయం మొదలైందనే చర్చ నడుస్తోంది. ప్రత్యర్థులపై మెయిన్ మీడియాలో ఇంటర్వ్యూల ద్వారా, సోషల్ మీడియా పోస్టుల ద్వార చెలరేగిపోయే ఆర్జీవీ ఇప్పుడు డిఫెన్స్‌లో పడ్డారు.
కోర్టుకు పోలీసులకు ఏం చెప్పారు?
సోషల్ మీడియా పోస్టుల విషయంలో తనకు వచ్చిన నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన ఆర్జీవీ తనను అరెస్టు చేస్తారేమో అని అనుమానం వ్యక్తంచేశారు. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడే ఆర్జీవీకి భయం మొదలైందని కూటమి శ్రేణులు కామెంట్స్ చేశాయి. ఇప్పుడు పోలీసులకు చిక్కకుండా పారిపోవడంతోపాటు నేరుగా విచారణకు హాజరుకాబోనని... డిజిటల్ విచారణకు ఓకే చెప్పడం కూడా అందుకే అంటున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్‌కు అనుకూలంగా చిత్రాలు తీసిన ఆర్జీవీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫ్యామిలీపై వివాదాస్పద పోస్టులు పెట్టారు. ఎవడైతే నాకేంటి అన్నట్టు కామెంట్స్ చేయడమే కాకుండా సోషల్ మీడియా పోస్టులు కూడా పెట్టారు. ప్రత్యర్థులను రెచ్చగొట్టేలా వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పెట్టిన పోస్టులు ఇప్పుడు ఆర్జీవీ మెడకు చుట్టుకుంటున్నాయి.
Also Read: 'జనసేన నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు' - టెక్కలి పోలీసులను ఆశ్రయించిన దివ్వెల మాధురి