ఈరోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్ధం కావట్లేదు. ఇక ప్రజల భద్రతా వారి రక్షణ చూసుకోవాలిసిన పోలీసులే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల అలాంటి సంఘటనే జరిగింది. వాహనాల తనిఖీల పేరుతో ఏకంగా రూ..18.5 లక్షల దోపిడీకి పాల్పడ్డాడు ఓ ఏఆర్ కానిస్టేబుల్.


దారి దోపిడి కేసులో పంజాగుట్ట పీఎస్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ బళ్లారి శ్రీకాంత్‌ను రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ సర్వీసు నుంచి తొలగించారు. ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీ పేరుతో 18.50 లక్షల నగదును ఏఆర్‌ కానిస్టేబుల్ బళ్లారి శ్రీకాంత్‌ కాజేసినట్లు విచారణలో తేలింది. ఏఆర్ కానిస్టేబుల్ బళ్లారి శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఆర్‌ కానిస్టేబుల్ బళ్లారి శ్రీకాంత్‌ చట్టవిరుద్ధమైన, నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడ్డాడని తెలుసుకుని.. 2018 బ్యాచ్‌కి చెందిన కానిస్టేబుల్‌ను సర్వీసు నుంచి రాచకొండ సీపీ తొలగించారు. పోలీసు సిబ్బంది ఎవరైనా దురుసుగా ప్రవర్తించిన, విధుల పట్ల నిర్లక్ష్యం ఉన్న కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ హెచ్చరించారు.


 20 లక్షల రూపాయలను పంజాగుట్ట బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు మెహిదీపట్నంలోని ఓ టెక్స్‌టైల్స్ షాప్ ఉద్యోగి ప్రదీప్ శర్మ వెళుతున్నాడు. సంస్థకు చెందిన కారులో వెళుతుండగా తాజ్ కృష్ణ వద్ద పోలీస్ పెట్రోలింగ్ వాహనంతో వచ్చి కారును కానిస్టేబుల్, మరొక వ్యక్తి అడ్డగించాడు. కారును తనిఖీ చేస్తుండగా అందులో నగదు లభ్యమైంది.


ఇంతలోనే కారు వద్దకు ముఠాలోని మరి కొంతమంది సభ్యులు వచ్చారు. టెక్స్‌టైల్ ఉద్యోగి ప్రదీప్ శర్మ దృష్టి మళ్లించి కానిస్టేబుల్ అండ్ గ్యాంగ్ బ్యాగులో నగదును కొట్టేశారు. రూ.18.50 లక్షలు కాజేసి కేవలం 1.50 లక్షల రూపాయలు మాత్రమే తిరిగి ఇచ్చారు. మోసపోయామని తెలుసుకున్న యజమాని సూచన మేరకు పంజాగుట్ట పోలీసులకు ప్రదీప్ శర్మ ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. ఒకరిని అరెస్ట్ చేసి కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.కానిస్టేబుల్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ కు చెందిన వాడిగా గుర్తించడం జరిగింది. సదరు కానిస్టేబుల్ ఓ ఇన్స్‌పెక్టర్ వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నట్టు తెలుస్తోంది.


ఇటీవల ఇలా కొన్ని ఘటనలు


అమాయకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తా అని వారి నుంచి లక్షలు వసూలు చేశాడు ఓ హెడ్ కానిస్టేబుల్. ఇక సైబరాబాద్ లో పలు పోలీస్ స్టేషన్ లలో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి.అమాయకపు ప్రజలను మోసం చేయగా వచ్చిన ఆ డబ్బు తో ఈ హెడ్ కానిస్టేబుల్ 4 లారీలు కొనడం జరిగింది.అలాగే ఫ్లాట్ కోసం బ్యాంక్ లో లోన్ కొరకు నకిలీ అడిషనల్ ఎస్పీ ఐడీ కార్డు తో మోసం కూడా చేశాడు.ఇక హెడ్ కానిస్టేబుల్ చేసిన ఈ మోసాన్ని తెలుసుకున్న నార్సింగ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.


డీఎస్పీ నంటూ అమాయక ప్రజల నుండి భారీగా డబ్బులు దోచుకున్న నకిలీ డీఎస్పీ స్వామి హైదరాబాద్‌లో పట్టుబడ్డ విషయం తెలిసిందే. కామారెడ్డిలో మొదలైన అక్రమ వసూళ్ల దందా సిద్దిపేట వరకు విస్తరించింది. సిద్దిపేటలో నకిలీ డీఎస్పీకి సహకరించింది ఎవరు అనే కోణంలో విచారణ చేపట్టిన అధికారులకు సిద్దిపేట వన్‌టౌన్ హెడ్ కానిస్టేబుల్ హస్తం ఉన్నట్టు తెలిసింది. నకిలీ డీఎస్పీతో చేతులు కలిపి సిద్దిపేటలో పలువురు నిరుద్యోగులకు టీఎస్‌ పీఎస్సీ, ఇతర డిపార్టుమెంట్లలో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికి భారీగా డబ్బులు దండుకున్నట్టు సమాచారం. దాదాపు ఒక్కో నిరుద్యోగి వద్ద సుమారు రూ.10 లక్షల వరకు కూడా వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఈ నకిలీ పోలీసును అరెస్ట్ చేశారు.