Tirumala Temple Closed On Lunar Eclipse 2023: 


తిరుమ‌ల‌ : పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేశారు. శ‌నివారం రాత్రి 7.05 గంటలకు పూజారులు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేశారు. ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు తెరవనున్నారు దాదాపు ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి. ఆదివారం తెల్లవారుజామున 1.05 నుండి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. గ్ర‌హ‌ణం అనంత‌రం శుద్ధి చేసి ఉద‌యం 6 గంట‌ల నుండి భ‌క్తుల‌ను స‌ర్వ‌ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. అదేవిధంగా, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని శ‌నివారం సాయంత్రం 6 గంటలకు మూసివేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు తెరుస్తారు. ఉదయం 7 గంటల నుంచి భక్తులకు సర్వ దర్శనం కల్పిస్తారు. గ్రహణం కారణంగా 28న సహస్ర దీపాలంకరణ సేవ, వికలాంగులు, వృద్ధులకు కల్పించే స్వామి వారి దర్శన సదుపాయాలను రద్దు చేశారు.


అనుబంధ ఆలయాలు కూడా 


చంద్రగ్రహణం కారణంగా తిరుమలలోని శ్రీవారి ఆలయంతో పాటు తిరుపతిలోనూ శ్రీ గోవిందరాజ స్వామి, శ్రీ కోదండ రామస్వామి, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లోనూ శనివారం రాత్రి 7 గంటలకు తలుపులు మూసివేయనున్నారు. గ్రహణం కారణంగా శ్రీ కోదండ రామ స్వామి వారి ఆలయంలో పౌర్ణమి అష్టోత్తర శతకలశాభిషేకం, శ్రీనివాస మంగాపురంలో పౌర్ణమి గరుడ సేవ రద్దయ్యాయి.


ఏపీలోని ఇతర ఆలయాలు సైతం మూసివేత..


పాక్షిక చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని ఏపీలోని విజయవాడ దుర్గమ్మ ఆలయం, శ్రీశైలం మల్లన్న ఆలయంతో పాటు ఇతర ఆలయాలన్నింటినీ మూసివేశారు. శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ వైదిక కమిటీ తెలిపింది. సాయంత్రం అమ్మవారికి పంచ హారతుల సేవ తర్వాత ఆలయ తలుపులు మూసివేసినట్లు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి స్నపనాభిషేకం, నిత్యాలంకరణ, పూజల అనంతరం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా ఆదివారం సుప్రభాత సేవ, వస్త్ర సేవ, ఖడ్గమాలార్చన రద్దు చేశారు. శ్రీచక్రార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణాలు యథావిధిగా జరుగుతాయని అధికారులు తెలిపారు. 


శ్రీశైలంలోనూ


చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలంలోనూ ఆలయ ద్వారాలు శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకూ మూత పడనున్నాయి. అనంతరం ఆలయ శుద్ధి, ప్రత్యేక పూజల అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. శనివారం మధ్యాహ్నం 3:30 గంటల వరకే స్వామి, అమ్మవార్ల సర్వ దర్శనం, మధ్యాహ్నం 12:30 గంటల వరకే గర్భాలయ ఆర్జిత అభిషేకాలు నిర్వహిస్తారు. శనివారం అన్న ప్రసాద వితరణ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకే నిర్వహిస్తామని, ఆ రోజు సాయంత్రం అల్పాహార వితరణ నిలుపుదల చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. భక్తులు గమనించాలని సూచించారు. 


గ్రహణం కారణంగా ఈ ఆలయాలే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలు, ఉపాలయాలు మూతపడనున్నాయి. ఆ సమయంలో భక్తులను దర్శనాలకు అనుమతించరు. కాగా, శనివారం ఏర్పడే చంద్రగ్రహణం దేశంలోని అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. నేరుగానే గ్రహణాన్ని చూడొచ్చని నిపుణులు తెలిపారు.