Bojjala Sudhir Reddy Protest at Srikalahasti Police Station:
శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లాలో టీడీపీ వర్సెస్ సీఐగా వివాదం కొనసాగుతోంది. శ్రీకాళహస్తి పట్టణంలోని తొట్టంబెడు పోలీస్ స్టేషన్ ని టీడీపీ కార్యకర్తలతో కలిసి బొజ్జల సుధీర్ రెడ్డి ముట్టడించారు.. కమ్మకొత్తూరు గ్రామంలో టీడీపీ కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించి, దుర్భాషలాడి బూటు కాలుతో రూరల్ సీఐ అజయ్ కుమార్ తన్నడంపై బొజ్జల సుధీర్ తమ కార్యకర్తను ఎందుకలా చేశావంటూ ప్రశ్నించారు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాదన నడిచింది. అయితే ఈ వాదనలో సీఐ అజయ్ కుమార్ బొజ్జల సుధీర్ పై మండిపడ్డారు.
చేసిన తప్పు ఒప్పుకుని పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలని సుధీర్ సీఐని డిమాండ్ చేశారు. కానీ నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, ఎవరికి ఫిర్యాదు చేసినా తాను భయపడనంటూ రూరల్ సీఐ అజయ్ కుమార్ చెప్పడంతో ఆగ్రహించిన శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి తన పార్టీ టీడీపీతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి పోలీసు స్టేషన్ ను ముట్టడించారు. టీడీపీ కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తించి, దుర్భాషలాడి, భౌతిక దాడులకు పాల్పడ్డ సీఐ అజయ్ కుమార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలుపుతూ బైఠాయించారు.
టీడీపీ, జనసేన శ్రేణుల నిరసనతో రూరల్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తతగా మారడంతో సమాచారం అందుకున్న డీఎస్పీ భీమారావు స్టేషన్ వద్దకు చేరుకుని విషయం అడిగి తెలుసుకున్నారు.. సీఐ అజయ్ కుమార్ ను సస్పెండ్ చేయాలని, లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని సుధీర్ రెడ్డి చెప్పడంతో డీఎస్పీ శాంతించాలని కోరినా ఫలితం కనిపించలేదు. దీంతో తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డితో బొజ్జల సుధీర్ రెడ్డి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. తమ కార్యకర్తపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, బూటు కాళ్లతో తన్నడంపై బొజ్జల సుధీర్ రెడ్డి ఎస్పీకి వివరించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఎవరికి చెప్పుకోవాలి, సామాన్యులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.