Cyber Crime : పదహారేళ్ల యువతి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఆన్ లైన్ చీటర్లు పదహారు లక్షలు రూపాయలు మోసం చేసిన ఘటన గుంటూరులో  జరిగింది. ఫిరంగిఫురానికి చెందిన బాధిత యువతి ఇంటర్మీడియేట్ చదువుతుంది. యువతి తండ్రి పొలం అమ్మగా వచ్చిన డబ్బులతో బంగారు ఆభరణాలు చేయించారు. ఆ తర్వాత ఇల్లు కట్టుకుందామని భావించి బంగారు ఆభరణాలు బ్యాంకులో పెట్టి రుణం తీసుకున్నారు. రుణంగా తెచ్చిన నగదును తండ్రి ఖాతాలో జమ చేశారు. ఈ బ్యాంక్ ఖాతా తండ్రి ఫోన్ లో పేమెంట్ యాప్స్ కు జోడించి ఉంది. అప్పుడప్పుడూ తండ్రి ఫోన్ తీసుకుని యువతి కొంత డబ్బును ఖర్చు చేసింది. సుమారు రెండు లక్షల రూపాయలను వాడుకుంది. అయితే తల్లిదండ్రులకు తెలియకుండా డబ్బులు వాడుకోవడంతో తిరిగి అడుగుతారని భావించిన బాధిత యువతి ఆ రెండు లక్షలు ఎలా సంపాదించాలో తెలియక యూట్యూబ్ లో సెర్చ్ చేసింది. అప్పుడు కిడ్నీ అమ్మితే ఏడు కోట్లు ఇస్తామన్న యాడ్ కనిపించింది. ఆ లింక్ ద్వారా ఆన్ లైన్ మోసగాళ్లు యువతిని ట్రాప్ చేశారు. అయితే ముందు కొంత నగదు ఖర్చుల కోసం పంపాలని సైబర్ నేరగాళ్లు యువతిని నమ్మించారు. ముందు పదివేల రూపాయలు ఖర్చుల కోసం యువతి సైబర్ నేరగాళ్లకు ఫోన్ పే చేసింది.


రూ.16 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు 


 అనంతరం ఫేక్ ఆన్ లైన్ ఖాతా ఓపెన్ చేసి ఆమెకు మూడున్నర కోట్ల రూపాయలను వేసినట్లు సైబర్ కేటుగాళ్లు సమాచారం ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకోవాలంటే మరికొంత అమౌంట్ పే చేయాలన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు పదహారు లక్షల రూపాయలు వసూలు చేశారు. అనుమానం రాకుండా కిడ్నీ ఇవ్వటానికి దిల్లీ రావాలని చెబితే యువతి గత నెలలో దిల్లీ కూడా వెళ్లి వచ్చింది. అయినప్పటికీ డబ్బులు రాలేదు. విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. తల్లిదండ్రుల ఒత్తిడి చేయడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి తన స్నేహితురాలి ఇంటికి చేరింది యువతి. తల్లిదండ్రులు వస్తున్నారని తెలుసుకున్న యువతి అక్కడి నుంచి కంచికచర్లకు చేరుకుంది. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని విచారణ చేయగా ఆన్ లైన్ మోసం బయటపడింది. తల్లిదండ్రులు యువతిని తీసుకొని గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సైబర్ నేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


యాడ్ చూసి కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమైన యువతి! 


 "యూట్యూబ్ ఓ యాడ్ చూశాను. అందులో కిడ్నీ డొనేట్ చేస్తే రూ.7 కోట్లు ఇస్తామన్నారు. ఆ నంబర్ ను వాట్సాప్ లో కాంటాక్ట్ చేస్తే వాళ్లు ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో రూ.3 కోట్లు చేశారు. అవి నా అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ అయ్యేందుకు ట్యాక్స్ కట్టాలని రూ.16 లక్షలు కట్టించుకున్నారు. ఇప్పుడు మరో రూ.1.50 లక్షలు అడుగుతున్నారు. మా నాన్నకు తెలియకుండా కొంత డబ్బు వాడుకున్నాను. వాటిని తిరిగి చెల్లించేందుకు కిడ్నీ డొనేట్ చేయాలనుకున్నాను. కిడ్నీ ఇచ్చేందుకు అక్టోబర్ లో దిల్లీ కూడా వెళ్లాను. కానీ అక్కడ ఎవరూ లేరు. తిరిగి వచ్చేశాను. డబ్బులు తిరిగి చెల్లించమంటే ఇంకో లక్షన్నర పే చేయమంటున్నారు. " - బాధితురాలు 


"ఇలా అన్ వేరిఫైడ్ లింక్స్ వచ్చినప్పుడు జాగ్రత వహించండి. ఇలాంటి వాటిపై పోలీసుల తరఫున అవగాహన కల్పి్స్తున్నాం. సైబర్ నేరాలు, లోన్ యాప్స్ పై జాగ్రత్తగా ఉండండి. ఫ్రాడ్ లింక్స్ పై క్లిక్ చేయకుండి. లింక్ పై క్లిక్ చేస్తే లాటరీ వస్తుంది అంటూ వచ్చే వాటిపై జాగ్రత్తగా ఉండండి. " -ఆరీఫ్ హఫీజ్, ఎస్పీ