Hyderabad News: మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ (Miyapur Police Station) పరిధిలో విషాద ఘటన జరిగింది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు (AP Govt Teacher) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. అన్నమయ్య జిల్లా రాయచోటి(Rayachoty)లో జయప్రకాశ్‌ నారాయణ (Jayaprakash Narayana) ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాయచోటి వెళ్తున్నానని చెప్పి కూకట్ పల్లి నుంచి బయల్దేరారు. మియాపూర్‌ సమీపంలోని మదీనాగూడలోని ఓ ఓయో లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు.


అయితే నిన్నటి నుంచి జయప్రకాశ్ నారాయణ బయటకు రాకపోవడంతో లాడ్జీ నిర్వాహకులు తలుపులు తెరిచే  ప్రయత్నం చేశారు. అయితే ఎంతసేపటికి తలుపులు తెరుచుకోకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని గది తలుపులు తెరవగా జయప్రకాశ్ నారాయణ విగతజీవుడిగా పడి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. విషం తీసుకొని జయప్రకాశ్ నారాయణ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడికి వివాహం కాలేదని, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడి సొంత ఊరు, వివరాలు తెలియాల్సి ఉంది.