Kalyanadurgam Child Death : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి ఉష శ్రీ చరణ్ పర్యటన సమయంలో చిన్నారి మృతి ఘటనపై ఎస్పీ ఫకీరప్ప స్పందించారు. చిన్నారి మరణించడం వెనుక పోలీసుల వైఫల్యం లేదన్నారు. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని జిల్లా ఎస్పీ ప్రదర్శించారు. ట్రాఫిక్ పేరుతో పోలీసులు ఆపేశారని దుష్ర్పచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. కళ్యాణదుర్గంలో శుక్రవారం రాత్రి శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్ కాన్వాయ్ వచ్చిన సందర్భంగా పోలీసులు వాహనాల రాకపోకలు ఆపడం వల్ల 8 నెలల చిన్నారి మరణించినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.
చిన్నారి మరణంపై ఎస్పీ వివరణ
ఈ ఘటనపై పూర్తి వివరాలును ఎస్పీ ఫకీరప్ప వివరణ ఇచ్చారు. కొన్ని మీడియాలో 8 నెలల చిన్నారి మృతికి పోలీసులు దారి ఇవ్వకపోవడమే కారణమని దుష్ప్రచారం జరిగిందన్నారు. సీసీటీవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తే పూర్తి వివరాలు తెలిశాయన్నారు. ఈ ఘటనపై లోతుగా విచారణ చేయగా చిన్నారి, తలిదండ్రులు శెట్టూరు మండలం కైరేవు సమీపంలోని చెర్లోపల్లి గ్రామం నుంచి సాయంత్రం 6:10 గంటలకు బయల్దేరారని ఎస్పీ తెలిపారు. చిన్నారి, తల్లి బైకులో వెళ్తున్నట్లు మంత్రి ఇంటి సమీపంలోని బ్రహ్మయ్య గుడి పోలీసు చెక్ పోస్టు వద్ద 6:36 గంటలకు కన్పించిందన్నారు.
ఏ టైంలో ఎక్కడ]?
"కళ్యాణదుర్గం టౌన్ లోకి వారు చిన్నారితో సహా ఎంటర్ అయిన టైం 6:40 pm. కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రికి ఎంట్రెన్ అయిన టైం 6:48 pm . ఆర్డీటీ ఓ.పి విభాగంలో నమోదు చేసిన సమయం 6:50 pm. ఆర్డీటీ ఆసుపత్రిలో చిన్నారి చనిపోయిన సమయం 7:18 pm. చెర్లోపల్లి నుంచి ఆర్డీటీ ఆసుపత్రికి వీరికి పట్టిన సమయం 38 నిముషాలు (మధ్య దూరం 20 kms). చిన్నారి మృతదేహంతో రోడ్డుపై ఆందోళనకు దిగిన సమయం 8:15pm. వాస్తవాలు వక్రీకరించి లేనిపోని రాద్ధాంతం చేయకండి. పోలీసులపై బురద జల్లడమే కాకుండా శాంతిభద్రతల సమస్యకు కారణామయితే చట్టపరమైన చర్యలు తప్పవు" అని ఎస్పీ ఫకీరప్ప అన్నారు.
సీసీటీవీలకు ధన్యవాదాలు
ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఈ ఘటనపై లోతుగా విచారణ చేపట్టామన్నారు. సాంకేతిక సాక్ష్యాలను సేకరించామన్నారు. సీసీటీవీల కారణంగా ఈ ఘటనలో పోలీసుల తప్పులేదని నిరూపించగలిగామన్నారు. పోలీసులపై లేనిపోని ఆరోపణలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.