Honour Killings: కాలం మారింది. అయినా కొన్ని అనాచార పద్ధతులు మారడం లేదు. నేటికి సమాజంలో పెళ్లిళ్ల విషయంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే చాలు.. పరువు పేరుతో హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పరువు హత్యలతో రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో అమ్మాయిని తల్లి, సోదరుడు చున్నీ బిగించి హత్య చేయగా, హైదరాబాద్‌(Hyderabad)లో మేన కోడలు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని మామ.. యువకుడిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపేశాడు.


అనంతపురంలో..
ఆ అమ్మాయికి 17 ఏళ్లు. ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. తన పెళ్లి గురించి ఇంట్లో వాళ్లు చేస్తున్న ప్రయత్నాల గురించి తెలుసుకున్న బాలిక తన ప్రేమ వ్యవహారం గురించి వారికి చెప్పింది. తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని బ్రతిమాలింది. అందుకు కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. తాము చూసిన అబ్బాయినే చేసుకోవాలని పట్టుబట్టారు. అందుకు అమ్మాయి అంగీకరించలేదు. దీంతో ఆగ్రహించిన తల్లి, సోదరుడు బాలికను దారుణంగా హతమార్చారు.


వివరాలు.. అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన కూతురిని ఓ తల్లి.. కొడుకు సాయంతో హతమార్చింది. వివరాలు.. గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన బాలిక(17) ఓ యువకుడిని ప్రేమించింది. అయితే కోమలకు ఇటీవల పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కోమల తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పింది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటానని తెలిపింది. 


బాలిక ప్రేమను ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే తాము పెళ్లి సంబంధం చూసిన వారికి ఏం చెప్పాలంటూ ప్రశ్నించారు. దీంతో వారి మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన తల్లి, సోదరుడు బాలికను చితకబాదారు. గొంతుకు చున్నీ బిగించి హతమార్చారు. తరువాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మ‌ృతదేహాన్న పోస్టుమార్టానికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


హైదరాబాద్‌లో యువకుడి హత్య
హైదరాబాద్‌లో పరువు హత్య జరిగింది. అంబర్‌పేట్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిని, అమ్మాయి మేనమామ క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపాడు. వివరాలు.. బాపునగర్‌కు చెందిన మౌనిక అనే అమ్మాయి శ్రీనివాస్ రాజును గత కొద్ది రోజుల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇది అమ్మాయి మేనమామ పుష్ప రాజ్‌కు నచ్చలేదు. శ్రీనివాస్ రాజు‌పై కోపం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి బ్యాట్‌తో చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


గత ఏడాది యువకుడి పరువు హత్య
అనంతపురం జిల్లాలో గతేడాది జూన్ నెలలో పరువు హత్య జరిగింది. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లికి చెందిన మురళి, వీణలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముత్యాలమ్మ, నాగన్న దంపతుల కుమారుడు మురళి (27),  ఏలుకుంట్ల గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుగా పని చేస్తున్న వీణ ప్రేమించి పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. తరువాత రాప్తాడులో నివాసం ఉండేవారు. రాప్తాడు వై జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై  కంపెనీ బస్సు కోసం మురళి వేచి చూస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి కిడ్నాప్ చేసి హతమార్చారు.