Anantapur Police Arrested Thieves Gang in haryana | అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో వరుసగా ఏటీఎం చోరీల కేసును అనంతపురం జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ చోరీలలో పాల్గొన్న మోస్ట్ డేంజరస్ హర్యానా ముఠాలోని కొందరు కీలక నిందితుల్ని అనంతపురం పోలీసులు ఆ రాష్ట్రంలోనే అరెస్టు చేసి ఏపీకి తరలించారు. గత కొద్ది రోజులుగా అనంతపురం జిల్లాలో హైవే లకు పక్కనే ఉన్న ఏటీఎంలను ఈ హర్యానా ముఠా టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్నట్లు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు.
ఖాకీ సినిమా స్టైల్ లో ఏటీఎం దొంగలు :
ఏటీఎం దొంగతనాలకు పాల్పడే నిందితులు ప్రధానంగా హర్యానా రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరు లారీలలో హైవేలపై తిరుగుతూ వారి పని నిమిత్తం వెళ్తూ ఉంటారు. లారీలో వెళ్తూ ఉన్నప్పుడు వీరు చోరీ చేయాల్సిన ఏరియాలో ఒక నిఘా ఏర్పాటు చేసుకుంటారు. మెగా ఏర్పాటు చేసుకున్న అనంతరం ఆ ముఠా సభ్యులు రాత్రి సమయాల్లో ఎక్కువ జనావాసం లేని టైంలో హైవే పక్కన లారీ ఆపి వారితో తెచ్చుకున్న గ్యాస్ కట్టర్లు, రాడ్లు, గోడకు పెయింటింగ్ వేసే స్ప్రేలతో ఏటీఎంలోకి చొరబడతారు. సీసీ కెమెరాల్లో కనిపించకుండా ముందుగానే వారి వెంట తెచ్చుకున్న స్ప్రే తో సిసి కెమెరాలకు స్ప్రే చేస్తారు. అనంతరం వారి దగ్గర ఉన్న ఇనుప రాడ్లు గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను పగలగొట్టి అందులో ఉన్న నగదును దోచుకెళ్తారు. ఇదంతా కూడా కేవలం 10 నిమిషాల్లోనే వారి పనిని ముగించుకొని తిరిగి వెళ్ళిపోతారు.
ఎస్బిఐ ఏటీఎం కేంద్రాలే వీరి టార్గెట్
హర్యానా దొంగల ముఠా ఎక్కువ ఎస్బిఐ ఏటీఎంలోనే టార్గెట్ గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఎస్బిఐ బ్యాంకుకు ఖాతాదారులు అధికంగా ఉండడం, లావాదేవీలు అదే స్థాయిలో నిర్వహిస్తూ ఉండడం వల్ల ఏటీఎం కేంద్రాలలోని మెషిన్లలో నగదు నిల్వ కూడా ఎక్కువ మొత్తంలో ఉంచుతారని, పెద్దగా సెక్యూరిటీ గార్డులు ఉండరని, ఎస్బిఐ ఏటిఎం కేంద్రాలను ఎంచుకుంటారు. ముఠా మొత్తం ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. పైగా స్నేహితులు కూడా, వీరిలో కొందరు పాత నేరస్తులు కూడా ఉన్నారు. రాబిన్, సద్దాం, టౌసిఫ్ లు చిత్తూరు జిల్లా గుడిపాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది జరిగిన ఏటీఎం కేంద్రం చోరీలో నిందితులు. అనంతపురం జిల్లాలో జరిగిన తరహానే అక్కడి ఏటీఎం సెంటర్లో దొంగతనం చేసి రూ. 25,98,400/- నగదు ఎత్తుకెళ్లారు.
చోరీకి గురైన అమౌంట్ రికవరీ చాలా కష్టమన్న పోలీసులు
హర్యానా దొంగల ముఠా ఏటీఎంలో చోరీ చేసిన నగదును రికవరీ చేయడం ఎంతో కష్టమని పోలీసులు వెల్లడించారు. వీరు వారు అనుకున్న ఏటీఎం నుంచి నగదు చోరీ చేసి వీరి ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరు 5000 రూపాయలు తీసుకొని మిగతా డబ్బు అంతా కూడా ఇంకొకరికి ఇచ్చి వారి రాష్ట్రానికి పంపిస్తారు. వీరంతా మళ్లీ వారి రాష్ట్రంలోని వారి సొంత గ్రామాలకు వెళ్లిన తరువాత చోరీ చేసిన నగదును సమానంగా పంచుకుంటారు. ఎవరైనా కూడా పోలీసులు నిందితులను అరెస్టు చేయడానికి వెళితే ఆ ఊరంతా కూడా ఏకమై వారిని కాపాడుతుందని పేర్కొన్నారు.
కర్ణాటక రాష్ట్ర పోలీసుల సహాయంతో ఎంతో కష్టం మీద ఏటీఎం చోరీల నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇందులో దాదాపు 30 లక్షల పైగా నగదు చోరీ అయితే కేవలం రెండు లక్షల మాత్రమే పోలీసులు రికవరీ చూపించారు. రెండు లక్షల తో పాటు ఒక లారీ గ్యాస్ కట్టర్లు ఇనుప రాడ్లు స్ప్రే సిలిండర్, 2 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మిగిలిన ముఠా సభ్యులను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.
Also Read: Saudi Desert: సౌదీ ఎడారిలో దారి తప్పిన తెలంగాణ యువకుడు - 4 రోజులుగా తిండి, నీరు లేక దుర్మరణం