Fire broke out in the Guru Nanak Dev Hospital in Amritsar, Punjab: Amritsar Hospital Fire: పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని గురునానక్ దేవ్ ఆసుపత్రిలో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రి ఔట్ పేషెంట్ విభాగం (ఓపీడీ) సమీపంలో మొదట పెద్ద పేలుడు సంభవించింది. అనంతరం అంతా చూస్తుండగానే ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గురునానక్ ఆసుపత్రిలో అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. దాంతో పేషెంట్లు ఒక్కసారిగా భయాందోళనకు గురై తమను కాపాడాలంటూ గట్టిగా కేకలు వేస్తున్నారు. 


ఓపీ విభాగంలో మంటలు.. 
ఓపీ విభాగంలో మొదలైన మంటలు స్కిన్ , కార్డియాలజీ వార్డులకు కూడా వ్యాపించాక స్పందించిన ఆసుపత్రి సిబ్బంది పేషెంట్లను ఇతర వార్డులకు, సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు ఫైర్ ఆఫీసర్ లవ్ ప్రీత్ సింగ్ తెలిపారు. మొదట 8 ఫైరింజన్లతో సిబ్బంది గురు నానక్ దేవ్ ఆసుపత్రికి చేరుకుని మంటల్ని అదుపు చేస్తున్నారు.






ట్రాన్స్‌ఫార్మర్స్ పేలడంతో..
గురునానక్ దేవ్ ఆసుపత్రిలోని ఓపీ సమీపంలో ఉన్న రెండు ట్రాన్స్‌ఫార్మర్‌లలో పేలుడు సంభవించింది. నిమిషాల్లో మంటలు, దట్టమైన పొగలు ఆసుపత్రిని కమ్మేశాయని ఆసుపత్రి ప్రిన్సిపల్ తెలిపారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొన్నారు. వేసవికాలం అవడంతో, వేడి కారణంగా ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి ఉండొచ్చునని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఆసుపత్రి యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Also Read: Char Dham Yatra Pilgrims Death: చార్​ధామ్ యాత్రలో విషాదాలు, ఇప్పటివరకు 31 మంది భక్తులు మృతి - కారణం ఏంటంటే !


Also Read: Delhi Mundka Fire: ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 27కి చేరిన మృతులు, ప్రధాని మోదీ నష్ట పరిహారం ప్రకటన