ACB Arrested Police Officials Who Taking Bribe In Hyderabad: ఏసీబీ అధికారులు విస్తృత దాడులతో అవినీతి అధికారుల పని పడుతున్నారు. తాజాగా, హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో (Kushai) శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ భూ వివాదం కేసులో రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా.. ఇన్‌స్పెక్టర్ వీరస్వామి, ఎస్సై షఫీ, మధ్యవర్తి ఉపేందర్‌లను అదుపులోకి తీసుకున్నారు. భూ వివాదానికి సంబంధించి పరిష్కారం కోసం మధ్యవర్తి ద్వారా లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లోనూ సోదాలు చేశారు. లంచం తీసుకుంటుండగా పోలీసులతో పాటు మధ్యవర్తిని పట్టుకున్నారు. గతంలో వీరిపై ఉన్న ఆరోపణలపైనా దృష్టి సారించారు. అటు, గుర్రంగూడ సమీపంలోని ఇన్‌స్పెక్టర్ వీరస్వామి నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి.


ఇరిగేషన్ శాఖలో..


మరోవైపు, నీటి పారుదల శాఖలో నలుగురు అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రంగారెడ్డి (Rangareddy) జిల్లా ఎస్ఈ కార్యాలయంలో ఓ దస్త్రం ఆమోదానికి సంబంధించి అధికారులు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగి అక్కడికక్కడే పట్టుకున్నారు. నీటి పారుదల శాఖ రంగారెడ్డి జిల్లా ఎస్ఈ కార్యాలయం అధికారుల్ని ఓ వ్యక్తి.. దస్త్రం ఆమోదం కోసం ఆశ్రయించారు. అయితే, అక్కడే ఈఈగా పని చేస్తోన్న భన్సీలాల్, ఏఈలు నిఖేశ్, కార్తీక్ ముగ్గురూ రూ.2.5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఇందుకు అంగీకరించిన సదరు వ్యక్తి తొలుత రూ.1.50 లక్షలు అందించారు. ఇంకో రూ.లక్షను గురువారం సాయంత్రం ఈఈ కార్యాలయంలోనే తీసుకుంటామని అధికారులు తెలిపారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా వారు పక్కా ప్లాన్ ప్రకారం మాటు వేశారు. నీటి పారుదల శాఖ అధికారులు గురువారం రాత్రి 8 గంటల సమయంలో బాధితుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. లంచం డిమాండ్ చేసిన మరో కీలక అధికారి ఒకరు త్రుటిలో తప్పించుకోగా అర్ధరాత్రి వరకూ హైడ్రామా కొనసాగింది. దాదాపు 4 గంటలు శ్రమించి కీలక అధికారిని పట్టుకుని.. మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. దాదాపు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో 20 మంది బృందం సోదాల్లో పాల్గొంది. 


Also Read: Hyderabad News: రూ.200 కోట్ల స్కాం - తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ అరెస్ట్