Student Commits Suicide After Wishing Her Friend Happy New Year In Anantapuram: న్యూ ఇయర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. ఏపీలోని అనంతపురానికి (Anantapuram) చెందిన విద్యార్థిని తనకు స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని బలవన్మరణానికి పాల్పడింది. ఇక తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాకు (Siricilla District) చెందిన విద్యార్థి తన స్నేహితురాలికి విషెష్ చెప్పగా అమ్మాయి తల్లిదండ్రులు అతనిపై దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన.. చిన్నతిప్పమ్మ (17) బళ్లా రోడ్డులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఈమెకు అదే కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోన్న విద్యార్థిని బెస్ట్ ఫ్రెండ్. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు.
న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని..
అయితే, మంగళవారం రాత్రి హాస్టల్‌లోని విద్యార్థినులంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో చిన్నతిప్పమ్మకు తన బెస్ట్ ఫ్రెండ్ విషెష్ చెప్పలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె బుధవారం హాస్టల్‌లోని మెస్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీన్ని గుర్తించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించగా.. వారు పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హాస్టల్ వద్ద తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
విద్యార్థిని మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వాస్పత్రి వద్ద విద్యార్థి సంఘాల నేతలతో కలిసి ఆందోళనకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిందని.. కాలేజీ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
న్యూ ఇయర్ విషెష్ చెప్పాడని..
అటు, తెలంగాణలోనూ న్యూ ఇయర్ వేళ తీవ్ర విషాదం జరిగింది. తన క్లాస్‌మేట్‌కు న్యూ ఇయర్ విషెష్ చెప్పిన బాలుడు.. సాయంత్రం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుని కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గంబీరావుపేట మండలం భీమునిమల్లారెడ్డి గ్రామానికి చెందిన శివకిషోర్ (17) అనే పదో తరగతి విద్యార్థి.. అదే గ్రామానికి చెందిన అమ్మాయికి న్యూ ఇయర్ విషెష్ చెప్పాడు. ఈ క్రమంలో అతనిపై.. అమ్మాయి కుటుంబసభ్యులు, బంధువులు దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శివకిషోర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబసభ్యులు పరారయ్యారు. అంతకు ముందు మృతుని తల్లికి కూడా వీరు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
శివకిషోర్ ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
తలలోకి క్రాకర్స్ దూసుకెళ్లి..
మరోవైపు, న్యూ ఇయర్ వేళ విశాఖలో తీవ్ర విషాదం జరిగింది. విశాఖలో శివ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఇంటి మేడపై క్రాకర్స్ కాలుస్తుండగా ప్రమాదవశాత్తు అతని తలలోకి దూసుకెళ్లింది. దీంతో సంఘటన స్థలంలోనే కుప్పకూలగా.. వెంటనే అతన్ని కుటుంబసభ్యులు, స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.