Pregnant Gives Birth In A Chair In Devarakonda: నల్గొండ జిల్లాలో (Nalgonda District) అమానవీయ ఘటన చోటు చేసుకుంది. సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ గర్భిణీ కుర్చీలోనే ప్రసవించిన ఘటన నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం రాత్రి జరిగింది. బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుగొమ్మ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి అశ్విని అనే గర్భిణీకి గురువారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడి వైద్యులు మూడో కాన్పు చేయడం కుదరదంటూ.. నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని పంపించారు. దీంతో ఆమెను అర్ధరాత్రి దాటిన తర్వాత నల్గొండ ఎంసీహెచ్‌లో చేర్చారు.
సిబ్బంది నిర్లక్ష్యం
అయితే, అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బెడ్ కానీ ఇతర సౌకర్యాలు కానీ కల్పించలేదు. ఈ క్రమంలోనే ఆమెను నర్సులు బయట కుర్చీలో కూర్చోబెట్టారు. దీంతో ప్రసవ వేదనతో బాధ పడుతూ అశ్వినీ కుర్చీలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. కుర్చీ కింద తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రి సిబ్బంది హడావుడి చేస్తూ అమెను వార్డులోకి తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సిబ్బంది తీరుపై బంధువులు, ఇతర రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని.. నిర్లక్ష్యం చేసిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి భర్త ఆంజనేయులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్ వెంటనే ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు. బాధ్యులపై చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని అన్నారు.