Engineering Student Murder In Hyderabad: హైదరాబాద్ (Hyderabad) నగరంలో దారుణాలు చోటు చేసుకున్నాయి. ఓ బీటెక్ విద్యార్థిని అతని స్నేహితులు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్ చౌరస్తా హోటల్ 37 వద్ద ప్రశాంత్ అనే ఇంజినీరింగ్ విద్యార్థిని అతని ముగ్గురు స్నేహితులు కత్తితో పొడిచి హతమార్చారు. మృతుడు ఎంవీఎస్ఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఓ యువతి ప్రేమ విషయంలో వారు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. 


నిందితులంతా ఒకే బస్తీలో నివాసం ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, హత్యకు ప్రేమ వివాదం కారణమా.? లేక పాత కక్షలేమైనా ఉన్నాయా.? అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.


పెంచిన తల్లినే మేకుతో పొడిచేశాడు


ఐదుగురు ఆడపిల్లలున్నా ఆ తల్లి కొడుకు కావాలని ఆశపడింది. బంధువుల వద్ద 2 నెలల బాబును దత్తత తీసుకుని కంటికి రెప్పలా.. కన్నబిడ్డలా పెంచింది. అయితే, పెంచిన మమకారం మరిచిన ఆ కొడుకు పశువులా ప్రవర్తించాడు. ఆమెను మేకుతో పొడిచి చంపేశాడు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్‌లోని బస్తీకి చెందిన జయమ్మ (64), స్వామి దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు. అబ్బాయి కావాలని ఆశ పడ్డ ఆ దంపతులు ఇక తమకు అబ్బాయి పుట్టడని భావించి బంధువుల పిల్లాడిని దత్తత తీసుకుని అతనికి వేణు అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. జయమ్మకు పదేళ్ల తర్వాత ఓ బాబు పుట్టాడు. అయినా, ఇద్దరు పిల్లలనూ అదే మమకారంతో ఒకేలా చూసుకున్నారు. ఆరేళ్ల క్రితం వేణుకు పెళ్లి చేయగా.. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 


మద్యానికి బానిసై..


కొంతకాలంగా వేణు మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతని తీరు నచ్చక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో డబ్బు కోసం తరచూ తల్లిని వేధించేవాడు. ఇటీవల అతనికి దాదాపు రూ.4 లక్షలు అవసరం అని బంధువులు తెలిపారు. బుధవారం రాత్రి బాగా తాగిన వేణు ఆ మత్తులోనే తల్లితో డబ్బుల కోసం మళ్లీ గొడవ పడ్డాడు. ఆమె తన వద్ద డబ్బులు లేవని చెప్పినా వినలేదు. కోపంతో ఊగిపోతూ ఓ పెద్ద మేకుతో ఆమె నుదిటిపై విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ జయమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


కాగా, జయమ్మ సొంత కొడుకు వినోద్ (24) మానసిక స్థితి సరిగా లేనట్లు తెలుస్తోంది. 18 నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. అయితే, వినోద్ అదృశ్యానికి వేణు కారణం కావొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు.