RTC Bus In Theft In Nandyal District: ఓ వ్యక్తి పుట్టింటికి వెళ్లిన తన భార్యను చూడాలనుకున్నాడు. అయితే, ఆర్టీసీ బస్సులో టికెట్ కొనేందుకు డబ్బుల్లేక ఏకంగా ఆ బస్సునే ఎత్తుకెళ్లాడు. నంద్యాల (Nandyal) జిల్లా ఆత్మకూరు (Atmakuru) పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన దుర్గయ్యకు కొన్నేళ్ల క్రితం పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది. కొద్ది రోజుల క్రితం దుర్గయ్య భార్య పుట్టింటికి వెళ్లగా.. తన భార్యను చూడాలనిపించింది. అయితే, ముచ్చుమర్రి వెళ్లేందుకు అతని వద్ద డబ్బులు లేవు.


అత్తారింటికి ఆర్టీసీ బస్సు


ఈ క్రమంలో ఎలాగైనా భార్యను చూడాలని డిసైడ్ అయిన దుర్గయ్య ఏకంగా ఆపి ఉంచిన ఆర్టీసీ అద్దె బస్సునే అత్తారింటికి ఎత్తుకెళ్లాడు. పట్టణ శివారులో ఆత్మకూరు - నంద్యాల ఆర్టీసీ సర్వీస్ బస్సును డ్రైవర్ పక్కన నిలిపి హోటల్‌లో టిఫిన్ చేసేందుకు వెళ్లాడు. ఈ సమయంలో దుర్గయ్య బస్సును తానే స్వయంగా నడుపుకొంటూ వెళ్లిపోయాడు. ఆ సమయంలో దుర్గయ్య మాత్రమే బస్సులో ఉన్నాడు. దీన్ని గమనించిన డ్రైవర్ షాకై బస్సును కొంతదూరం వెంబడించినా ఫలితం లేకపోయింది. అయితే, దారిలో బస్సు ఖాళీగా వెళ్తుండడాన్ని గమనించిన ఇతర డ్రైవర్లు.. బస్ డ్రైవర్‌కు సమాచారం ఇచ్చారు. దుర్గయ్య నేరుగా బస్సును ముచ్చుమర్రి గ్రామంలోని అత్తారింటికి తీసుకెళ్లాడు. దీన్ని చూసిన బంధువులు కంగుతిన్నారు. చేసేదేమీ లేక బస్సును స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.


తన వద్ద ముచ్చుమర్రి గ్రామానికి రావడానికి డబ్బుల్లేకే ఆర్టీసీ బస్సును తీసుకుని వచ్చినట్లు దుర్గయ్య పోలీసులకు చెప్పాడు. అతని సమాధానం విని షాకైన పోలీసులు విచారించి దుర్గయ్యకు మతిస్థిమితం లేదని తేల్చారు. ఈ క్రమంలో బస్సును ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌కు తరలించి ఓనర్లకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేయనట్లు తెలుస్తోంది.


Also Read: Badrachalam: గోదావరికి వరద ఉద్ధృతి - భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ