Buggana Criticized Chandrababu  :  ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు ప్రవేశ పెట్టిన  ఆర్థిక శ్వేతపత్రంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు.  శ్వేతపత్రం 30 పేజీలకు పైన ఉందని  .. ఇది సాకు పత్రం అని ఆరోపించారు. సమస్యలు చెప్పారు కానీ.. ఎలా పరిష్కరిస్తారో .. సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలు చేస్తారో చెప్పలేదన్నారు. డేటా కావాలని అంటున్నారని   డేటా లేకుండానే శ్వేతపత్రం విడుదల చేశారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం పెట్టిన బుగ్గన చంద్రబాబు విమర్శలకూ సమాధానం ఇచ్చారు. నాలుగు ప్రధాన పథకాల కోసమే మద్యం ఆదాయంను తాకట్టు పెట్టామన్నారు.

  


అప్పులు తక్కువేనని చంద్రబాబు శ్వేతపత్రంలో అబద్దాలు చెబుతున్నారని ఆరోపణ                         


వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు  కాగ్‌, ఇతర సంస్థల నివేదికలు అడ్డుపెట్టి అప్పుల గురించి ప్రశ్నించారని.. కానీ  ఇప్పుడు  మాట్లాడటం లేదన్నారు. గతంలో టీడీపీ హయాం కంటే తక్కువే అప్పులు చేశామన్నారు. చంద్రబాబు పాలనలో దేశ స్థూల ఉత్పత్తిలో ఏపీ వాటా 4.47 శాతం, వైసీపీ ఐదేళ్ల పాలనలో 4.82 ఉందన్నారు.   వైసీపీ అధికారంలోకి రాగానే 2.79 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని... కానీ ఇప్పుడు చంద్రబాబు పెట్టలేకపోతున్నారన్నారు.  టీడీపీ 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి, గవర్నర్‌తో 10 లక్షల కోట్లు అని చెప్పించిందని .. అసలు లెక్క చెప్పాల్సి వస్తుందనే బడ్జెట్ పెట్టడం లేదని ఆరోపించారు. 


తమ హయాంలోనే జీడీపీ ఎక్కువని వాదన                                                  


శ్వేతపత్రంలో నిజాలు లేవని.  మా పాలనలోనే ఏపీ తలసరి ఆదాయం మెరుగుపడిందని  బుగ్గన స్పష్టం  చేశారు.  చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అప్పులు చేస్తున్నారని వాటి గురించి   మీడియా అస్సలు ప్రస్తావించడం లేదని విమర్శించారు.    చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారా  అని  ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. హామీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకే  శ్వేతపత్రమని విమర్శించారు. 


హామీలు అమలు చేయకుండా సాకులు చెబుతున్నారని ఆరోపణ                                           


చంద్రబాబు ప్రవేశ పెట్టిన శ్వేతపత్రంలో అప్పుల గురించి కాకుండా..  బుగ్గన రాజేంద్రనాత్ రెడ్డి పర్సంటేజీల గురించి మాత్రమే మాట్లాడారు . ఇంత శాతం  ఎక్కువ.. ఇంత శాతం తక్కువ అని గతంలో తాము చెప్పిన లెక్కలే చెప్పారు.  శ్వేతపత్రంలో అన్ని అబద్దాలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టడంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు విచిత్రంగా స్పందించారు. హైదరాబాద్ తెలుగురాష్ట్రాలకు సెంటర్ పాయింట్ లాంటిదని అత్యవసర పనుల మీద వచ్చి ప్రెస్ మీట్లు పెట్టవచ్చని చెప్పారు.