Pattikonda Love Story In Kurnool District: పెళ్లికి కొన్ని గంటల ముందు ఓ యువతి కల్యాణ మండపం నుంచి పారిపోయింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సదరు యువతి ఓ అబ్బాయితో వెళ్లిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన కర్నూలు జిల్లాలో (Kurnool District) శుక్రవారం జరగ్గా.. అదే యువతి శనివారం ప్రియునితో కలిసి పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమైంది. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పత్తికొండలోని గోపాల్ ప్లాజాలో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా.. పెళ్లికూతురు వైష్ణవి అదృశ్యమైంది. ఆమె తన ప్రియుడితో కలిసి శనివారం పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమైంది. ప్రియుడిని పెళ్లి చేసుకుని అతనితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. వైష్ణవి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో కల్యాణమండపం నుంచి వెళ్లిపోయానని.. పెళ్లికుమారుడితో తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని పోలీసులకు తెలిపింది. అందుకే తనకు నచ్చిన అబ్బాయితో వెళ్లానని చెప్పింది. 


ఫిర్యాదు వెనక్కు తీసుకోవాలని..


తమపై తండ్రి ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని వైష్ణవి పోలీసులను కోరింది. అయితే, ఆమె తండ్రిని తీసుకుని వస్తే ఫిర్యాదు వెనక్కు తీసుకుంటానని చెప్పడంతో ఆమె పీఎస్ నుంచి వెళ్లిపోయింది.


ఇదీ జరిగింది


అనంతపురానికి (Anantapuram) చెందిన నరేంద్ర కుమార్ కుమార్తె వైష్ణవికి, కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన బజారి కుమారుడు విశ్వాసికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. తెల్లవారితే పెళ్లి, రాత్రి సంప్రదాయాల ప్రకారం చిన్నతాంబులం, పెద్ద తాంబూలం కూడా చేశారు. అయితే అమ్మాయికి ఇష్టం లేకపోవడంతో ఉదయం 4 గంటలకు కళ్యాణ మండపం నుంచి వెళ్లిపోయింది. దీంతో కొన్ని గంటల్లో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. ఈ క్రమంలో పెళ్లి కుమార్తె తండ్రి కన్నీరు మున్నీరవుతూ పత్తికొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు తెల్లవారుజామున ఆమె ఓ యువకునితో వెళ్లిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనతో అటు వరుడు, ఇటు వధువు తరఫు వారు నిరుత్సాహంగా ఉండిపోయారు. శుక్రవారం ఈ ఘటన జరగ్గా.. శనివారం సదరు యువతి పోలీసుల ఎదుట ప్రత్యక్షమైంది.


Also Read: Free Gas Cylinder In AP: ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అర్హులు ఎవరు? ఎలా బుక్‌ చేయాలి? ఎప్పుడు బుక్ చేయాలి?