Minor Abused By Another Minor In Hyderabad: తెలంగాణలో దారుణాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ ఉప్పల్‌లోని (Uppal) ఓ ప్రముఖ స్కూల్‌లో చిన్నారిపై ఓ విద్యార్థి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రెండో తరగతి విద్యార్థినిపై తొమ్మిదో తరగతి విద్యార్థి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. సదరు విద్యార్థికి పాఠశాల యాజమాన్యం టీసీ ఇచ్చి పంపించేసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు నిరసనగా స్కూల్ ముందు పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. మేనేజ్మెంట్ స్పందించకుంటే పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని పేరెంట్స్, విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. వారికి పలు రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో పాఠశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
వేధింపులతో మైనర్ ఆత్మహత్య
అటు, మేడ్చల్ జిల్లాలో (Medchal District) ప్రేమ వేధింపులతో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్‌లో నివాసముంటున్న శారద, కుమార్ దంపతులకు ముగ్గురు బాలికల సంతానం. మొదటి అమ్మాయి (16) సిద్ధిపేట జిల్లాలో 9వ తరగతి చదువుకుంటూ ఓ హాస్టల్‌లో ఉండేది. ఇటీవలే ఆమె బాలాజీనగర్‌లోని తన ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో అదే ప్రాంతంలో కూల్ డ్రింక్ షాపులో పని చేసే శివ (20) అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారు అందించిన సమాచారం మేరకు, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలోనూ దారుణం
అటు, ఏపీలోనూ దారుణం జరిగింది. ఓ స్కూల్ కరస్పాండెంట్ బాలికలపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన అనంతపురంలో (Anantapuram) జరిగింది. అనంతపురం ఆదిమూర్తి నగర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో బాలికలపై స్కూల్ కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్ అసభ్యంగా ప్రవర్తించాడని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని బాలికలకు డబ్బులు, తినుబండారాలు ఇస్తున్నాడని.. మరికొందరిని బెదిరించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఓ చిన్నారి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో కరస్పాండెంట్ అసలు భాగోతం వెలుగుచూసింది. ఈ క్రమంలో శుక్రవారం పాఠశాల వద్ద బాలికల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత బాలికను సఖి సెంటర్‌కు తరలించారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మృగాళ్ల తీరు మారడం లేదని.. నిందితున్ని కఠినంగా శిక్షించాలని బాలికల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.