Gannavaram Police Searching For Vallabhaneni Vamsi :  గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం విజయవాడ పోలీసులు వెదుకుతున్నారు. ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన తరవాత నియోజకవర్గంలో నివాసం ఉండటం లేదు. కుటుంబంతో కలిసి ఆయన హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయారు. అందుకే గన్నవరం నుంచి మూడు ప్రత్యేక బృందాలు ఆయనను అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆయన నివాసంతో పాటు ఇతర చోట్ల నిఘా పెట్టారు.ఆయన ఆచూకీ తెలియగానే అరెస్టు చేసే అవకాశం ఉంది. 


గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి మాస్టర్ మైండ్ వంశీ              


గత ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు కొన్ని కార్లను తగులబెట్టారు. ఆ ఘటన సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దాడికి పాల్పడిన వారంతా వల్లభనేని వంశీ అనుచరులే. దాడిని ఆయనే పర్యవేక్షించారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పట్లో పోలీసులు టీడీపీ కార్యకర్తలపైనే కేసులు పెట్టారు.  దాడులు చేసిన వైసీపీ కార్యకర్తలు, వంశీ అనుచరుల జోలికి వెళ్లలేదు. టీడీపీ నేత పట్టాభిరాంను కూడా అరెస్టు చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత కృష్ణా జిల్లాకు ఎస్పీగా వచ్చిన గంగాధర్ రావు ఈ కేసు విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. 


ప్రభుత్వం మారిన తర్వాత  దాడి చేసిన నిందితులపై కేసులు 


గన్నవరం టీడీపీ ఆఫీసుపై  దాడి వ్యవహారంలో సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులపై కేసులు పెట్టి అరెస్టు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో 71వ నిందితుడిగా వల్లభనేని వంశీని చేర్చారు. ఇప్పటికే పలువుర్ని అరెస్టు చేశారు. వారంతా జైల్లో ఉన్నారు. వంశీని అరెస్టు చేస్తే.. లఈ కేసులో అసలు కుట్ర దారుడెవరో తేలిపోయే అవకాశం ఉండటంతో పోలీసులు ఆయన కోసం గాలింపు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వంశీపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ ఓడిపోవడం.. తాను కూడా ఓడిపోవడంతో వంశీ ముందు జాగ్రత్తగా విజయవాడ నుంచి వెళ్లిపోయారు. ఆయన అమెరికాలో ఆశ్రయం కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నట్లుగా గతంలో ప్రచారం జరిగింది.కానీ వంశీ ఇంత వరకూ స్పందించలేదు. 


హైదరాబాద్‌లో మూడు ప్రత్యేక బృందాలు                             


ఇప్పుడు ఆయన పోలీసులకు అందుబాటులో రాకపోతే.. అమెరికా పారిపోయారన్న అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. ఆయన కుటంబసభ్యులు కూడా వంశీ ఎక్కడ అన్న విషయంపై స్పందించడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేగా 2019లో గెలిచిన ఆయన వైసీపీలో చేరారు. చంద్రబాబు కుటుంబంపై అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నేతలకు టార్గెట్ అయ్యారు. నారా లోకేష్ కూడా.. గన్నవరం పిల్ల సైకోను వదిలేదని పాదయాత్ర సమయంలోనూ..ఎన్నికల సమయంలోనూ చెప్పారు.ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో.. వల్లభనేని వంశీ ఎందుకైనా మంచిదని ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ఆయన అమెరికా వెళ్లారా.. లేకపోతే ఇక్కెడెక్కడయినా ఉండి.. దోబూచులాడుతున్నారా అన్నది  పోలీసులు తేల్చనున్నారు.