Husband Killed His Wife In Nagarkurnool District: తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు చోటు చేసుకున్నాయి. ఏపీలోని కోనసీమ జిల్లాకు చెందిన దంపతులు అప్పుల భారంతో సూసైడ్ లెటర్ రాసి మరీ అదృశ్యమయ్యారు. అటు, తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యను ఐరన్ రాడ్‌తో కొట్టి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం అగ్రికల్చర్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రాజు, జ్యోతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 17 ఏళ్ల క్రితం వివాహం కాగా ఓ కుమార్తె. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. జ్యోతిని రాజు అనుమానించేవాడు. గురువారం ఇదే విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. ఆగ్రహంతో ఊగిపోయిన రాజు ఆమెను అక్కడే ఉన్న ఇనుప రాడ్డుతో బలంగా కొట్టాడు. ఈ క్రమంలో ఆమె కింద పడిపోయినా ఆగకుండా విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో జ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 


భార్యను హత్య చేసిన అనంతరం రాజు నేరుగా తన కూతురితో కలిసి వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


సూసైడ్ లెటర్ రాసి..


'మేం ఎక్కువగా అప్పులు చేశాం. తీర్చలేక వెళ్లిపోతున్నాం. మా కోసం వెతకొద్దు.' అంటూ దంపతులు అదృశ్యమైన ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. అమలాపురం మండలం గున్నేపల్లి అగ్రహారం గ్రామానికి చెందిన కొబ్బరి ఒలుపు కార్మికుడు యార్లగడ్డ దుర్గారావు, సుశీల దంపతులు గురువారం నుంచి అదృశ్యమయ్యారు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అమలాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు దుర్గారావు తన సెల్ నుంచి పండు అనే వ్యక్తికి ఓ ఆడియో మెసేజ్ పంపినట్లు గుర్తించారు. మోటార్ సైకిల్ అంబాజీపేట కొబ్బరి గొడౌన్ వద్ద ఉందని.. తాళం కూడా అందులోనే పెట్టినట్లు దుర్గారావు అందులో చెప్పాడు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు. ఓ సూసైడ్ లెటర్‌ను సైతం గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే, వారు ఆత్మహత్య చేసుకున్నారా.? లేక అదృశ్యమయ్యారా.? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.


ప్రమాద ఘటనలు


ఏపీలోని కడప జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పులివెందుల - కదిరి మార్గంలో శుక్రవారం ఉదయం ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో పులివెందుల ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆటోలో ఉన్న వారంతా సత్యసాయి జిల్లా బట్రెపల్లె వాసులుగా గుర్తించారు. వీరు కూలి పని కోసం పులివెందుల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


తెలంగాణలో..


అటు, తెలంగాణలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ - రాయదుర్గం ఎఫ్‌డీడీఐ వద్ద నందిహిల్స్ నుంచి వేగంగా వచ్చిన కారు షేక్‌పేట్ ఫ్లై ఓవర్ పిల్లర్‌ను ఢీకొని నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న బీబీఏ విద్యార్థి చరణ్ (19) స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. అతను ఇక్ఫాయి యూనివర్శిటీలో చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.