Devotees Attacked On Srisailam Employee: శ్రీశైలం ఆలయంలో (Srisailam Temple) ఓ ఉద్యోగి మద్యం తాగి విధులకు హాజరు కావడం కలకలం రేపింది. గురువారం రాత్రి 9 గంటలకు ఆలయంలోని క్యూ కంపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. మద్యం సేవించి విధులకు హాజరైన ఉద్యోగిని గుర్తించిన భక్తులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం కొందరు భక్తులు ఆలయ క్యూలైన్ల వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆలయంలో అపచారం జరిగిందని.. ఆలయ పవిత్రతను కాపాడడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఆలయ సహాయ కార్య నిర్వాహక అధికారి జి.స్వాములు అక్కడికి చేరుకుని భక్తులకు సద్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆలయ సిబ్బంది మద్యం తాగి విధుల్లో పాల్గొంటే ఏం చేస్తున్నారంటూ ఆయన్ను భక్తులు నిలదీశారు. ఉన్నతాధికారులు ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై శుక్రవారం ఉదయం ఈవో పెద్దిరాజుకు ఫిర్యాదు చేశారు.


నందీశ్వరునికి పరోక్ష సేవ


మరోవైపు, శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం సాయంత్రం త్రయోదశి ఘడియలు ప్రారంభం కాగా.. నందీశ్వరునికి పరోక్ష సేవగా అర్చకులు విశేషార్చన జరిపించారు. ప్రతి మంగళ, త్రయోదశి రోజుల్లో ఈ కైంకర్యం జరుగుతుంది. భక్తులు ప్రతి నెలలోనూ.. శుద్ధ త్రయోదశి, బహుళ త్రయోదశి రోజుల్లో నందీశ్వరునికి పరోక్ష సేవగా విశేష పూజ నిర్వహించుకునే అవకాశాన్ని దేవస్థానం అధికారులు కల్పించారు. ఈ సేవ కోసం భక్తులు ఆన్ లైన్ ద్వారా రూ.1,116 సేవా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. www.srisailamdevasthanam.org లేదా aptemples.ap.gov.in ద్వారా చెల్లింపులు జరపవచ్చని అధికారులు సూచించారు. నందీశ్వర స్వామి ఆరాధన వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని.. రుణబాధలు, అనారోగ్య సమస్యలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు. మానసిక ప్రశాంతత చేకూరుతుందని పండితులు పేర్కొంటున్నారు. టికెట్లు, ఇతర సేవల పూర్తి వివరాలకు దేవస్థానం సమాచార కేంద్రం ఫోన్ నెంబర్ 8333901351/52/53 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.


Also Read: Crime News: తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్ స్టోరీస్ - ఓ చోట భార్యను రాడ్‌తో కొట్టి చంపిన భర్త, మరో చోట సూసైడ్ లెటర్ రాసి మరీ దంపతుల అదృశ్యం