Stampede In Yemen:


యెమెన్‌లో ఘటన..


యెమెన్ రాజధాని సనాలోని ఓ స్కూల్‌లో తొక్కిసలాట జరిగి 85 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఆర్థిక సాయం కోసం భారీ సంఖ్యలో ప్రజలు స్కూల్‌లోకి చొచ్చుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. తొక్కిసలాటలో శ్వాస అందక చాలా మంది నేలకొరిగారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంతా గట్టిగా అరుస్తూ ఎటు పడితే అటు పరుగులు పెడుతున్నారు. ఇంకొందరు తమ వాళ్ల కోసం వెతుక్కుంటున్నారు. ఉన్నట్టుండి సొమ్మసిల్లి పడిపోయిన వారిని చూసి భయంతో కేకలు వేశారు. కొందరిని కాపాడేందుకు ప్రయత్నించినా అప్పటికే వాళ్లు ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ వారిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. రంజాన్ సందర్భంగా కొందరు బడా వ్యాపారులు ప్రజలకు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన విన్న స్థానికులు ఒక్కసారిగా స్కూల్‌కి పోటెత్తారు. వాళ్లను ఎలా కంట్రోల్ చేయాలో అర్థంకాక నిర్వాహకులు చేతులెత్తేశారు. 










డబ్బు పంచుతామంటూ ప్రకటన 


డబ్బు కోసం ఉన్నట్టుండి ఎగబడడం వల్ల ఒకరిపై ఒకరు పడిపోయారు. కొందరు తొక్కుకుంటూ ముందుకు పరుగులు పెట్టారు. అలా కాళ్ల కింద నలిగిపోయి ఊపిరాడక చనిపోయారు. 5 వేల యెమెనీ రియాల్స్ (Yemeni Riyals) ఇస్తామన్న ప్రకటనతో అంతా ఆశపడ్డారు. ప్రతి ఒక్కరికీ 9 యెమెనీ రియాల్స్ ఇస్తారని ప్రచారం చేశారు. ఆ ఆశే వాళ్ల ప్రాణాలు తీసింది. ప్రస్తుతానికి గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రులకు చికిత్స అందిస్తున్నారు. వారిలో ఎంత మంది ప్రాణాలతో ఉంటారన్నది క్లారిటీ లేదు. ప్రభుత్వ అనుమతి లేకుండా, పోలీసుల సాయమూ తీసుకోకుండా డబ్బు పంపిణీ చేస్తామని ప్రకటించిన ఆ వ్యాపారులను అరెస్ట్ చేశారు. 




Also Read: Atiq Ahmed Case: రిపోర్టింగ్‌లో క్రాష్ కోర్స్ చేసి మరీ హత్య, నిందితులకు సహకరించిన ముగ్గురు జర్నలిస్ట్‌లు అరెస్ట్