దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 12,591 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, ఇది నిన్నటితో పోలిస్తే 20 శాతం ఎక్కువ. ఒమిక్రాన్ సబ్-వేరియంట్ XBB.1.16 కేసుల పెరుగుదలకు దారితీస్తుందని వైద్య నిపుణులు తెలిపారు. అయినప్పటికీ, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు.

  


దేశంలో కొత్త కరోనా కేసుల సంఖ్య పదివేల మార్కును బుధవారమే దాటేసింది. మంగళవారం నుంచి బుధవారం మధ్య 24 గంటల వ్యవధిలో 10,542 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 38 మరణాలు నమోదు అయ్యాయి. యాక్టివ్ కేసులు 63,562కి చేరుకోగా, మొత్తం మరణాల సంఖ్య 5,31,190కి చేరుకుంది.


వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,42,50,649కి చేరుకోగా, కేసు మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది.


ఢిల్లీలో 1,757 కోవిడ్ కేసులు, 6 మరణాలు
ఢిల్లీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం బుధవారం 1,757 కేసులు, ఆరు మరణాలు రిజిస్టర్ అయ్యాయి. పాజిటివిటీ రేటు 28.63 శాతం నమోదైంది. ఈ మరణాలతో ఢిల్లీలో మొత్తం మరణాల సంఖ్య 26,578కి చేరుకుంది.