Zomato 10 Minute Delivery: కేవలం 10 నిమిషాల్లో ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ మీ ఇంటికొస్తుంది! అంటూ ఆర్భాటంగా ప్రకటించిన జొమాటోకు సెగ బాగానే తగులుతోందని తెలిసింది. గురుగ్రామ్‌లోనే చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టులోనే చాలా లోపాలు బయటపడ్డాయని సమాచారం. ఒకవైపు హోటళ్లు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు అంత త్వరగా తీసుకొస్తే ఫుడ్‌ క్వాలిటీ బాగానే ఉంటుందా అని కస్టమర్లు సందేహిస్తున్నారు. ఇక పది నిమిషాల్లో డెలివరీ చేయలేక బాయ్స్‌ ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. మొత్తంగా 10 నిమిషాల్లో డెలివరీ 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తోందట!


'తీవ్రమైన ఎండలు, డెలివరీ కుర్రాళ్ల కొరత వల్ల జొమాటో పది నిమిషాల డెలివరీ 15-20 నిమిషాలు ఆలస్యమవుతోంది. అందులోనూ ఇన్‌స్టాంట్‌ ఆర్డర్లు డెలివరీ చేసేందుకు ప్రత్యేకమైన బృందం లేదు' అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. 


'గురుగ్రామ్‌లో కొన్ని పరిమిత ప్రాంతాల్లో 10 నిమిషాల డెలివరీ పైలట్‌ ప్రాజెక్టు ఆరంభించాం. కస్టమర్లు వేగంగా కోరుకుంటున్న ఫుడ్‌ ఏంటో గుర్తించేందుకు దీనిని చేపట్టాం. ఇది కొంత విజయవంతమైంది. ఈ సేవలను ఇతర నగరాల్లోకి విస్తరించే ముందు గురుగ్రామ్‌లోనే అన్ని ప్రాంతాల్లో పరీక్షిస్తాం. మా రెస్టారెంట్, డెలివరీ భాగస్వాములకు ఇబ్బందల్లేని వ్యవస్థను నిర్మిస్తాం' అని జొమాటో అంటోంది.


వాస్తవంగా ఈ పది నిమిషాల డెలివరీ సేవలను ఈ నెల్లోనే బెంగళూరులో ఆరంభించాలి. కానీ  ప్రణాళికను జొమాటో నిలిపివేసిందని తెలిసింది. కాంపిటీటివ్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) ఈ వ్యవహారం గురించి దర్యాప్తు చేస్తుండటం ఒక కారణంగా తెలిసింది. అంతేకాకుండా ఇన్‌స్టాంట్‌ డెలివరీని రెస్టారెంట్లు వ్యతిరేకిస్తున్నాయి. 'ఏదైనా ఒక వంటకాన్ని ప్రిపేర్‌ చేయడానికి కనీసం 10-20 నిమిషాలు పడుతుంది. అలాంటిది ఈ మొత్తం ప్రక్రియ 10 నిమిషాల్లోనే పూర్తి చేయడం అసాధ్యం. వంట చేయడానికి, డెలివరీ కుర్రాళ్లకు ఇవ్వడానికి ఒక నిర్దేశిత సమయం పెడితే మంచిది. అల్ట్రా ఫాస్ట్‌ డెలివరీ కింద ప్రీమియం ధరలు వసూలు చేయాలి' అని హోటళ్లు, రెస్టారెంట్ల వారు అంటున్నారు.