Year Ender 2022: 2022లో స్టాక్‌ మార్కెట్లను అతలాకుతలం చేసిన అతి పెద్ద అంశం భౌగోళిక- రాజకీయ ఉద్రిక్తతలు (ఉక్రెయిన్- రష్యా ఆయుధ యుద్ధం, చైనా- అమెరికా వాణిజ్య యుద్ధం). ఈ ఉద్రిక్తతల కారణంగా ఈ ఏడాది (2022) ప్రైమరీ మార్కెట్‌ సెంటిమెంట్‌ బాగా దెబ్బతింది. 2021లో కనిపించిన జోష్‌ 2022లో లేదు. నవ తరం (న్యూ ఏజ్‌) సాంకేతికత సంస్థలు సహా అన్ని రంగాల పబ్లిక్‌ ఇష్యూలు బాగా నిరాశపరిచాయి. 


2021లో 63 కంపెనీలు IPOలను ప్రారంభించి రూ. 1.20 లక్షల కోట్లను మార్కెట్‌ నుంచి ఎగరేసుకుపోయాయి. సగటున, నెలకు 5కు పైగా IPO ప్రైమరీ మార్కెట్‌లోకి వచ్చాయి. 2020 కరోనా పరిస్థితుల వల్ల IPOల సంఖ్య 15కు మాత్రమే పరిమితమైంది. ఇవన్నీ కలిసి రూ. 26,611 కోట్లు సమీకరించాయి.


LIC వాటా 35 శాతం
2022 జనవరి నుంచి ఇప్పటి వరకు (2022 డిసెంబర్‌ 18వ తేదీ) 36 కంపెనీలు ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌కు (IPOలు) వచ్చాయి, దాదాపు రూ. 57 వేల కోట్లను సమీకరించాయి. గత ఏడాదితో (2021) పోలిస్తే ఇది 50 శాతం కన్నా తక్కువ. పైగా, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) IPO సైజ్‌ రూ. 20,557 కోట్లను ఇందులోనుంచి నుంచి మినహాయిస్తే, 2022లో IPOల మొత్తం విలువ మరీ తీసికట్టుగా కనిపిస్తుంది. 2022లో పబ్లిక్‌లోకి వచ్చిన కంపెనీలు IPOల ద్వారా సమీకరించిన డబ్బులో 35 శాతం వాటా LICది కావడం విశేషం. 


2022లో, సగటున నెలకు 3 కంపెనీలు పబ్లిక్‌ ఆఫరింగ్‌కు వచ్చాయి.


ప్రైమ్‌ డేటాబేస్‌ (Prime Database) రిపోర్ట్‌ ప్రకారం.... 2022లో డిసెంబరు 18 వరకు, IPOల ద్వారా 36 కంపెనీలు రూ. 56,940 కోట్లను ప్రైమరీ మార్కెట్‌ నుంచి సమీకరించాయి. కేఫిన్‌ టెక్నాలజీస్‌ ( KFin Technologies), ఎలిన్‌ ఎలక్ట్రానిక్స్‌ (Elin Electronics) IPOలు వరుసగా డిసెంబర్‌ 19, డిసెంబర్‌ 20, 2022 నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి రెండు కలిసి రూ. 1,975 కోట్ల వరకు సమీకరిస్తున్నాయి. ఈ మొత్తాన్ని కూడా కలిపితే, మొత్తం IPOల విలువ ఇంకాస్త పెరుగుతుంది. 


OFS షేర్ల వాటానే ఎక్కువ
2021 తరహాలోనే 2022లోనూ IPOల్లో పెద్ద భాగం ఆఫర్‌ ఫర్‌ సేల్‌ది (OFS). ఆయా కంపెనీల్లో ప్రమోటర్లు, ముందస్తుగా పెట్టుబడి పెట్టినవాళ్లు తమ వాటాలను అధిక ధర వద్ద మార్కెట్‌కు అంటగట్టారు, వేల కోట్ల లాభాలతో ఎగిరి పోయారు. 
2022 మార్చి నెలలో, ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా రుచి సోయా (Ruchi Soya) రూ. 4,300 కోట్ల వరకు సేకరించింది.


రూ. 20,557 కోట్లతో, దేశ IPOల చరిత్రలోనే అతి పెద్ద పబ్లిక్‌ ఇష్యూగా LIC టాప్‌ ప్లేస్‌లో ఉంది. 2022లో దీని తర్వాతి స్థానాల్లో డెలివరీ (రూ. 5,235 కోట్లు), అదానీ విల్మార్‌ (రూ. 3,600 కోట్లు), వేదాంత ఫ్యాషన్‌ (రూ. 3,149 కోట్లు), గ్లోబల్‌ హెల్త్‌ (రూ. 2,205 కోట్లు) ఉన్నాయి.


2022లో (డిసెంబర్‌ 18వ తేదీ వరకు) వచ్చిన మొత్తం 36 IPOల్లో కేవలం రెండు (Delhivery, Traxion Tech) మాత్రమే నవ తరం టెక్నాలజీ కంపెనీల IPOలు. 2021లో మార్కెట్‌ తలుపు తట్టిన పేటీఎం (Paytm) సహా కొన్ని టెక్‌ కంపెనీలు షేర్లు పేలవ ప్రదర్శన చేయడం వల్ల, 2022లో 2 న్యూ ఏజ్‌ టెక్‌ సంస్థలు మాత్రమే పబ్లిక్‌లోకి వచ్చాయి.


2022లో, 14 IPOలకు 10 రెట్లకు పైగా స్పందన లభించింది. హర్ష ఇంజినీర్స్‌ ఇంటర్నేషలన్‌ లిమిటెడ్‌ (Harsha Engineers International Limited) IPO అత్యధికంగా 75 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయింది. ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా (Electronics Mart India - 72 రెట్లు), డీసీఎక్స్‌ సిస్టమ్స్‌ (DCX Systems - 70 రెట్లు) తర్వాతి ర్యాంకుల్లో ఉన్నాయి.


కొత్త ఏడాది కోసం సిద్ధంగా 59 IPOలు
2023లో, ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ ద్వారా ప్రజల్లోకి వచ్చేందుకు 59 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, సెబీ నుంచి ఇప్పటికీ వీటికి గ్రీన్‌ సిగ్నల్‌ అందిందని ప్రైమ్‌ డేటాబేస్‌ రిపోర్ట్‌ ప్రకారం తెలుస్తోంది. ఇవన్నీ కలిసి రూ. 88,140 కోట్లను సమీకరించవచ్చని అంచనా. రూ. 51,215 కోట్ల సమీకరణ ప్రతిపాదనతో మరో 30 కంపెనీలు సెబీకి DRHPలు సమర్పించాయి. వీటికి అనుమతి అందాల్సి ఉంది.