White Goods Prices May Increase: మధ్యప్రాచ్యంలో, ఇజ్రాయెల్ -హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ‍‌(Israel-Hamas War) ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోంది. కమ్ముకున్న యుద్ధ మేఘాలు ఎప్పుడు విడిపోతాయో, ప్రశాంత వాతావరణం ఎప్పుడు కనిపిస్తుందో తెలీడం లేదు. యుద్ధ దుష్పరిణామాలు ప్రపంచ వాణిజ్యంపైనా కనిపిస్తున్నాయి. షిప్పింగ్ కంటైనర్ల కొరత, చైనా నుంచి వచ్చే వస్తువులపై సరకు రవాణా చార్జీల పెంపు కారణంగా ఐటీ హార్డ్‌వేర్, టీవీ, వాషింగ్ మెషీన్, ఏసీ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతిమంగా, ఇది భారతీయ వినియోగదార్ల జేబులకు చిల్లు పెడుతుంది.


నాలుగు రెట్లు పెరిగిన సరకు రవాణా వ్యయాలు
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, గత 2 నెలల్లో, కొన్నిచోట్ల సరుకు రవాణా వ్యయాలు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. ఇజ్రాయెల్ -హమాస్ మధ్య యుద్ధానికి ముందు, సరకు రవాణా ఓడలు అమెరికా & యూరప్‌ దేశాలకు చేరుకోవడానికి సూయజ్ కెనాల్ (Suez Canal) మార్గంలో వెళ్లేవి. ఇప్పుడు, సూయజ్‌ కెనాల్‌ గుండా వెళ్లే నౌకలపై హౌతీలు (Houthis) దాడులు చేస్తుండడంతో, ఆ ముప్పు నుంచి తప్పించుకోవడానికి వాణిజ్య నౌకలు చుట్టూ తిరిగి దాదాపు 8,500 కి.మీ. దూరం ప్రయాణిస్తున్నాయి. ఇలా చుట్టూ తిరిగి వచ్చే మార్గాన్ని దాదాపు 330 అతి భారీ నౌకలు ఎన్నుకున్నాయి. వీటిలో సుమారు 12 వేల కంటైనర్లు ఉన్నాయి. దూరం పెరగడం వల్ల రవాణా వ్యయాలు, సమయం పెరుగుతున్నాయి. నౌకల అందుబాటు తగ్గింది. ఫలితంగా, ఈ ఏడాది మే నెల నుంచి చైనా పోర్టుల్లో ఓడల కొరత ఏర్పడింది. అంతేకాదు, రవాణా కోసం ఎక్కువ సమయం పడుతుండేసరికి, వస్తువులు ఎక్కువ కాలం పాడైపోకుండా చూసేందుకు కంపెనీలు తమ తయారీ విధానాలను కూడా మార్చుకోవాల్సి వస్తోంది. 


పెరిగిన లాజిస్టిక్స్ ఖర్చు భారం కస్టమర్లపైనే..
ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్‌ ప్రకారం, లాజిస్టిక్స్ ఖర్చు పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలో 2 నుంచి 3 శాతం వరకు ఉంటుంది. ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు (Tensions in the Red Sea) ఇంకా ఎక్కువ కాలం కొనసాగితే, పెరిగిన లాజిస్టిక్‌ కాస్ట్‌ను కస్టమర్ల నుంచి రాబట్టడం ఖాయమన్న ఆందోళనలు మార్కెట్‌లో వ్యక్తమవుతున్నాయి. సరకుతో బయలుదేరిన ఓడ తన గమ్యస్థానాన్ని చేరుకోవడానికి పట్టే సమయం 35 నుంచి 40 శాతం పెరిగింది. రెడ్‌ సీ సంక్షోభం (Red Sea Crisis) కారణంగా ప్రపంచవ్యాప్తంగా 20, 40 అడుగుల కంటైనర్ల ధరలు పెరిగాయి. సాధారణంగా, కంపెనీలు తమ వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి పంపడానికి 20 అడుగుల కంటైనర్‌లను ఇష్టపడుతుంటాయి.


మొబైల్ ఫోన్ ధరలపై ప్రభావం ఉండదు
సూయజ్ కెనాల్ ద్వారా ప్రపంచ వాణిజ్యం తిరిగి ప్రారంభమైతేనే పరిస్థితి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కో కంటైనర్‌ ధర 2400-2900 డాలర్ల మధ్య ఉంది. ఎర్ర సముద్ర సంక్షోభానికి ముందు ఇది 850 నుంచి 1000 డాలర్లుగా ఉంది. అయితే, మొబైల్ ఫోన్ల ధరలపై ఈ పరిస్థితి ఎలాంటి ప్రభావం చూపదు. మొబైల్‌ ఫోన్‌ విడిభాగాలు చాలా తేలికైనవి, సున్నితమైనవి కాబట్టి వాటిని వాయుమార్గంలో రవాణా చేస్తారు. 


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి