WeWork Global Bankruptcy: ప్రముఖ కో-వర్కింగ్‌ స్టార్టప్‌ ‘వివర్క్‌' (WeWork), అమెరికాలో చాప్టర్‌ 11 దివాలా పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో వివర్క్‌ ఇండియా (WeWork India) స్పందించింది. వివర్క్‌ ఇండియా స్వతంత్రంగా పనిచేస్తుందని, యుఎస్‌లో వివర్క్‌ గ్లోబల్ దివాలా పిటిషన్‌ దాఖలు చేసినప్పటికీ భారతదేశంలోని తన వాటాదార్లపై ఆ ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. 


ఒకప్పుడు 47 బిలియన్‌ డాలర్ల విలువకు ఎదిగిన హై-ఫ్లై స్టార్టప్ WeWork Inc. కరోనా టైమ్‌ నుంచి దీనికి కష్టకాలం స్టార్ట్‌ అయింది, ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది.


వివర్క్ ఇండియా క్లారిఫికేషన్‌
"వివర్క్ ఇండియా ఒక ప్రత్యేక సంస్థ. వివర్క్‌ గ్లోబల్‌ ఇటీవలి ఛాప్టర్‌ 11 దివాలా పిటిషన్‌ వల్ల భారత్‌లోని మా మెంబర్లు, స్టేక్‌హోల్డర్ల మీద ప్రభావం చూపదు. మేము మా మెంబర్లు, ల్యాండ్‌లార్డ్స్‌, పార్ట్‌నర్స్‌కు యథావిధిగా సేవలు అందిస్తాం. మా వ్యాపార వృద్ధికి, విజయానికి కట్టుబడి ఉన్నాం " అని X లో ఒక పోస్ట్‌ను వివర్క్‌ ఇండియా షేర్‌ చేసింది.


2010లో ప్రారంభమైన వివర్క్‌ గ్లోబల్‌కు, ఈ ఏడాది జూన్ 30 నాటికి 39 దేశాల్లోని 777 ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ఉనికి ఉంది. కానీ, దీని బిజినెస్‌ లాభసాటిగా లేదు. అయితే, వివర్క్‌ ఇండియా మాత్రం, తన బిజినెస్‌ 2021 నుంచి లాభాల్లో ఉందని ప్రకటించింది.


దాదాపు 50 బిలియన్‌ డాలర్ల అప్పులు 
ప్రస్తుతం, వివర్క్‌ గ్లోబల్‌ నెత్తిన 50 బిలియన్‌ డాలర్ల వరకు అప్పులు ఉన్నాయని అంచనా. రుణాలు, వాయిదాలను ఇన్‌ టైమ్‌లో చెల్లించలేకపోతోంది. దీంతో, అప్పులు ఇచ్చిన బ్యాంకులు & ఆర్థిక సంస్థలు వివర్క్‌ గ్లోబల్‌ మీద ఒత్తిడి తేవడం ప్రారంభించాయి. ఒకవైపు రుణదాతల ప్రెజర్‌, మరోవైపు బిజినెస్‌ సరిగా సాగక ఈ కంపెనీ సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో, ఒత్తిళ్ల నుంచి కాస్త విరామం తీసుకోవడానికి న్యూజెర్సీ కోర్టులో ఛాప్టర్‌ 11 దివాలా పిటిషన్‌ ‍‌(WeWork Global Chapter 11 bankruptcy filing) దాఖలు చేసింది. దీనివల్ల, రుణదాతల ఒత్తిళ్లు ఆగుతాయి, స్థలం లీజుకు ఇచ్చిన వారితో చర్చలు జరిపేందుకు అవకాశం లభిస్తుంది.


2019లో, వివర్క్‌ గ్లోబల్‌ విలువను 47 బిలియన్‌ డాలర్లుగా లెక్కించిన సాఫ్ట్‌బ్యాంక్‌, 2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టింది. అప్పట్లో ఈ కంపెనీ IPOకు వచ్చేందుకు యత్నించింది. అదే సమయంలో కరోనా మొదలైంది. దీంతోపాటు, కంపెనీ కో-ఫౌండర్‌ & ఆనాటి CEO ఆడమ్‌ న్యుమాన్‌ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ఆడమ్‌, తన సొంత ప్రయోజనాల కోసం పని చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో, CEO పదవికి అతను రాజీనామా చేయాల్సి వచ్చింది. కంపెనీ విలువ భారీగా పతనమై, IPO ప్లాన్‌ ఆగిపోయింది. ఆ దెబ్బ నుంచి కోలుకునే టైమ్‌లో ప్రపంచవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్స్‌ స్టార్టయ్యాయి, ఆఫీసులు మూతబడ్డాయి. 2021లో వివర్క్‌ విలువ పతనమై 9 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. ఆ సమయంలోనే ఈ కంపెనీ ఐపీవోకు వచ్చి మార్కెట్‌లో లిస్ట్‌ అయింది. 


కరోనా దెబ్బ వల్ల, నిర్వహణ ఖర్చులు కూడా రాబట్టుకోలేనంత దీనస్థితికి వివర్క్‌ గ్లోబల్‌ దిగజారింది. ఫలితంగా, దివాలా పిటిషన్‌ దాఖలు చేయాల్సి వచ్చింది.


తమ గ్లోబల్ యూనిట్, వ్యాపారాన్ని మెరుగు పరుచుకోవడానికి యుఎస్‌లో కీలక వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రారంభించిందని, కెనడాలోనూ ఒక గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టిందని వివర్క్‌ ఇండియా వెల్లడించింది.


మరో ఆసక్తికర కథనం: హోమ్‌ లోన్‌, కార్‌ లోన్‌ మీద దీపావళి ధమాకా ఆఫర్లు, ఎక్‌స్ట్రా ఛార్జీలన్నీ రద్దు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial