Vodafone Idea FPO: ప్రైవేట్‌ రంగ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా, ఫాలో-ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ను‍‌ (FPO) అతి త్వరలో మార్కెట్‌లో లాంచ్‌ చేయబోతోంది. ఈ కంపెనీకి రూ. 18,000 కోట్ల విలువైన ఎఫ్‌పీవోతో రాబోతోంది. పెట్టుబడిదార్లు ఈ FPOలో ఈ నెల 18 - 22 తేదీల మధ్య పెట్టుబడి పెట్టొచ్చు. ఒక్కో షేరు ముఖ విలువను రూ.10గా కంపెనీ నిర్ణయించింది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఈ ఆఫర్‌ ఈ నెల 16న ఓపెన్‌ అవుతుంది.


ఏ కంపెనీ అయినా ఒక్కసారే ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు (IPO) రాగలదు. ఆ IPO పూర్తై, షేర్లు లిస్ట్‌ అయిన తర్వాత.. ఆ కంపెనీ మరోమారు ప్రజలకు షేర్లు అమ్మాలంటే.. అప్పుడు జరిగే ప్రాసెస్‌ను ఫాలో-ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ అంటారు. ఇక్కడ పిలిచే పిలుపు మారుతుంది తప్ప, IPOలో జరిగే ప్రాసెసే FPOలోనూ జరుగుతుంది. FPO అనేది నిధుల సేకరణ ప్రక్రియ. దీని ద్వారా.. మార్కెట్‌లో ఇప్పటికే లిస్ట్‌ అయిన కంపెనీ.. తన ప్రస్తుత వాటాదార్లు, పెట్టుబడిదార్లు, ప్రమోటర్లకు కొత్త షేర్లను జారీ చేస్తుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ అదనపు నిధులను సేకరిస్తుంది.


వొడాఫోన్ ఐడియా ఎఫ్‌వీవో ప్రైస్‌ బ్యాండ్
వొడాఫోన్ ఐడియా ఎఫ్‌వీవోలో, ఒక్కో లాట్‌కు 1298 షేర్లను కేటాయించారు. ఒక్కో షేర్‌కు ప్రైస్‌ బ్యాండ్‌ 10 రూపాయల నుంచి 11 రూపాయలు. ఈ ఎఫ్‌పీఓ ద్వారా రూ.18,000 కోట్లు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ ఇష్యూలో మొత్తం 16,36,36,36,363 షేర్లను కంపెనీ విక్రయిస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనిష్టంగా ఒక లాట్ (1298 షేర్లు) - గరిష్టంగా 14 లాట్ల (18,172 షేర్లు) కోసం బిడ్‌ వేయవచ్చు. ఈ కేస్‌లో, రిటైల్‌ ఇన్వెస్టర్‌ పెట్టుబడి కనిష్టంగా రూ. 14,278 - గరిష్టంగా రూ. 1,99,892 అవుతుంది.


షేర్లు ఎప్పుడు లిస్ట్ అవుతాయి?
ఈ నెల 18 నుంచి 22 తేదీల మధ్య FPO కోసం సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు. ఏప్రిల్ 23న పెట్టుబడిదార్లకు షేర్ల కేటాయింపు జరుగుతుంది. FPOలో షేర్లు దక్కని పెట్టుబడిదార్లకు ఏప్రిల్ 24న బ్యాంక్‌ ఖాతాలోకి డబ్బు తిరిగి వస్తుంది. బిడ్‌ విన్‌ అయిన పెట్టుబడిదార్లకు ఏప్రిల్ 24న డీమ్యాట్ ఖాతాలో షేర్లు వస్తాయి. ఈ షేర్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ NSE, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌ BSEలో ఈ నెల 25న లిస్ట్‌ అవుతాయి.


ఈక్విటీ & డెట్ ఫండ్స్ ద్వారా మొత్తం రూ.45,000 కోట్లను సమీకరించాలని వొడాఫోన్ ఐడియా ప్లాన్ చేసింది. ఈక్విటీ, ఈక్విటీ లింక్డ్ రూట్ ద్వారా రూ.20,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. మిగిలిన మొత్తాన్ని అప్పుల రూపంలో తీసుకోవాలని అనుకుంటోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: భారతి హెక్సాకామ్ బంపర్ లిస్టింగ్, ఇన్వెస్టర్లకు లాభాల పంట