Lok Sabha Elections 2024: మూడో దశ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఇవాళ మొదలు కానుంది. రెండో దశ ఎన్నికలకు నామినేషన్ల గడువు ఏప్రిల్ 19తో ముగిసిపోతుందని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెల్లడించింది. 12 రాష్ట్రాల్లోని 94 పార్లమెంటరీ నియోజకవర్గాలకు మూడో దశ పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 20వ తేదీన ఈ నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఇక అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణకు ఏప్రిల్ 22 చివరి తేదీ. మధ్యప్రదేశ్‌లో బేతుల్ నియోజకవర్గానికి పోలింగ్ వాయిదా పడగా దీనికీ ఇవాళే నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఈసీ. నిజానికి ఇక్కడ రెండో దశలోనే జరగాల్సి ఉన్నా BSP పార్టీ అభ్యర్థి మృతి చెందడం వల్ల మూడో దశకు మార్చాల్సి వచ్చింది. ఈ మూడో దశ పోలింగ్‌కి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ని అధికారికంగా ఈసీ విడుదల చేయనుంది. మూడో దశ పోలింగ్‌లో అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రా అండ్ నగర్ హవేలీ, దమన్ అండ్ దియూ, గోవా, గుజరాత్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలున్నాయి. ఈ రాష్ట్రాల్లోని 94 నియోజకవర్గాలకు మే 7వ తేదీన పోలింగ్ జరగనుంది.