Vehicle Sales Record: మన దేశంలో పండుగల సీజన్ వినాయక చవితి, ఓనంతో ప్రారంభమవుతుంది. ఇండియాలో బిజినెస్ చేసే ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్, వెహికల్ కంపెనీలకు ఇది అత్యంత కీలక సమయం. ఏడాది మొత్తం ఇవి చేసే వ్యాపారంలో, ఈ పండుగ టైమ్‌లోనే దాదాపు 60 శాతం సేల్స్ చేస్తాయి. దసరా టైమ్‌కి పండుగ సీజన్ పీక్ స్టేజ్‌లో ఉంటుంది. అంటే, సేల్స్ గరిష్ట స్థాయికి చేరే టైమ్ ఇది.
ఇప్పుడు పాయింట్‌లోకి వద్దాం... ఈ ఏడాది దసరా పండుగను వెహికల్ కంపెనీలు గ్రాండ్‌గా జరుపుకున్నాయి. నవరాత్రుల్లో వాహన రిటైల్ అమ్మకాలు 57% పెరిగాయని, దాదాపు 5.4 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) తెలిపింది.
FADA విడుదల చేసిన లెక్కల ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్ 26 - అక్టోబర్ 5 (నవరాత్రులు) మధ్య కాలంలో మొత్తం వాహన రిటైల్ అమ్మకాలు 5,39,227 యూనిట్లుగా ఉన్నాయి. గత సంవత్సరం నవరాత్రి సమయంలో విక్రయించిన 3,42,459 యూనిట్లతో పోలిస్తే ఇది 57 శాతం వృద్ధి.
ఇదొక్కటే కాదు, ఈ సంవత్సరం నవరాత్రి విక్రయాలు కూడా ఒక రికార్డే. 2019 నవరాత్రి సమయంలో 4,66,128 యూనిట్లు అమ్మడయితే, ఆ నంబర్‌ను ఇప్పటి అమ్మకాలు దాటేశాయి.
టూ వీలర్స్
నవరాత్రి సమయంలో, ద్విచక్ర వాహనాల రిటైల్ విక్రయాలు గతేడాది నమోదైన 2,42,213 యూనిట్లను దాటి, 52.35 శాతం వృద్ధితో 3,69,020 యానిట్లకు చేరాయి. 2019లో ఇవి 3,55,581 యూనిట్లు అమ్మడయ్యాయి.
త్రీ వీలర్స్
త్రి చక్ర వాహనాల (త్రీ వీలర్స్) అమ్మకాలు రెట్టింపుపైగా పెరిగాయి. గతేడాది నవరాత్రుల సమయంలో నమోదైన 9,203 యూనిట్ల నుంచి ఈ ఏడాది 19,809 యానిట్లకు పెరిగాయి.
ప్యాసింజర్ వెహికల్స్
ప్రయాణికుల వాహనాల (ప్యాసింజర్ వెహికల్స్) విక్రయాలు గతేడాది నవరాత్రుల సమయంలోని 64,850 యూనిట్ల నుంచి భారీగా పెరిగి ఈ ఏడాది లక్ష మార్కును చేరాయి. ఈ ఏడాది 70.43 శాతం వృద్ధితో 1,10,521 యానిట్లకు పెరిగాయి.
కమర్షియల్ వెహికల్స్
వాణిజ్య వాహనాల (కమర్షియల్ వెహికల్స్) విక్రయాలు గతేడాది నవరాత్రుల సమయంలోని 15,135 యూనిట్ల నుంచి 48.25 శాతం వృద్ధితో ఈ ఏడాది 22,437 యూనిట్లకు చేరాయి.
ట్రాక్టర్లు
ట్రాక్టర్ల అమ్మకాలు గతేడాది నవరాత్రుల సమయంలోని 11,062 యూనిట్ల నుంచి 57.66 శాతం పెరిగి ఈ ఏడాది 'సెప్టెంబర్ 26 - అక్టోబర్ 5' కాలంలో 17,440 యూనిట్లకు చేరాయి.
మూడు సంవత్సరాల విరామం తర్వాత కస్టమర్లు తిరిగి షోరూమ్‌లకు తిరిగి వస్తున్నారని FADA ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా చెప్పారు. దీపావళి వరకు ఇదే ట్రెండ్ కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు. ఆటో సెక్టార్ బూమ్ మళ్లీ మొదలైందనడానికి షోరూమ్స్‌లో పెరిగిన రద్దీనే నిదర్శనమని వెల్లడించారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.