Unique Job Applicantion: ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది. ఆ డబ్బుతో వ్యక్తిగత & కుటుంబ అవసరాలు తీరతాయి. మంచి జీతం ఉంటే, సంసార నౌక కష్టాల సుడిగుండాల్లో చిక్కుకోకుండా సాఫీగా సాగుతుంది. అందుకే, ఏ వ్యక్తి అయినా వీలైనంత ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగాన్ని కోరుకుంటాడు. కానీ, ఉద్యోగం కోసం వెతుకున్న ఓ వ్యక్తి (Job Applicant) మాత్రం వైరెటీగా ఆలోచించాడు. తనకు ఉద్యోగం ఇస్తే, కంపెనీకి తానే డబ్బులు ఇస్తానంటూ ఆఫర్‌ ఇచ్చాడు. ఈ సంఘటన ప్రస్తుతం వైరల్‌ ఫీవర్‌లా (Viral News) ప్రపంచాన్ని చుట్టేస్తోంది.


'వింగిఫై' ఫౌండర్‌కు ఎదురైన అనుభవం
సాఫ్ట్‌వేర్ స్టార్టప్‌ కంపెనీ 'వింగిఫై' ‍‌(Wingify) వ్యవస్థాపకుడు పరాస్ చోప్రాకు (Paras Chopra) ఆ ఆసక్తికర అనుభవం ఎదురైంది. ఉద్యోగం కోరుతూ ఓ వ్యక్తి నుంచి జాబ్‌ అప్లకేషన్‌ వచ్చింది. ఆ అప్లికేషన్‌తో పాటు వచ్చిన 'ఆఫర్‌ మెసేజ్‌' చూసి పరాస్‌ చోప్రా షాక్‌ తిన్నారు. ఆ సందేశం తాలూకు స్క్రీన్‌ షాట్‌ను ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో షేర్‌ చేశారు. మీరు ఎవరినైనా ఆకట్టుకోవాలనుకుంటే ఇది కూడా ఒక మార్గం అని కామెంట్‌ రాశారు. 'ఈ సందేశం నా దృష్టిని కూడా ఆకర్షించింది, అయితే నేను డబ్బు తీసుకోలేదు' అని వెల్లడించారు. 


ఎంత డబ్బు ఇస్తాడట?
పరాస్ చోప్రాకు వచ్చిన మెసేజ్‌లో ఇలా ఉంది - "నేను వింగిఫైలో పని చేయాలని అనుకుంటున్నాను. మీ కోసం నేను ఒక ఆఫర్‌ ఇస్తున్నాను. మీ కంపెనీలో నాకు ఉద్యోగం ఇస్తే, మీకు నేను 500 డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు 41,500 రూపాయలు) ఇస్తాను. నేను బాగా పని చేయగలనని ఒక వారంలో నన్ను నేను నిరూపించుకోలేకపోతే మీరు నన్ను ఉద్యోగం నుంచి తొలగించవచ్చు. అలాగే, నేను ఇచ్చిన డబ్బును మీరే ఉంచుకోవచ్చు. మీరు నా సీరియస్‌నెస్‌ని అర్థం చేసుకునేందుకు & మీ టీమ్‌ సమయాన్ని వృథా చేయకూడదని డబ్బు పంపుతున్నాను. మీ తిరస్కరణ కోసం ఎదురు చూస్తున్నాను".






ఈ మెసేజ్‌అతి తక్కువ సమయంలోనే ప్రపంచమంతా చక్కర్లు కొట్టింది, టాక్‌ ఆఫ్‌ ది సోషల్ మీడియాగా మారింది. సదరు వ్యక్తి పంపిన సందేశంపై నెటిజన్లు తలో రకంగా కామెంట్‌ చేశారు. జాబ్ మార్కెట్ ఎంత దారుణంగా ఉందో ఈ ఆఫర్ చూపిస్తోందని ఒక యూజర్‌ కామెంట్‌ రాశారు. ఉద్యోగం కోసం వెతుకుతున్న వ్యక్తి కంపెనీకి డబ్బు ఆఫర్ చేస్తున్నాడని మరో వ్యక్తి రాశారు. ఒక్క మెసేజ్‌తో ఆ వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించాడని కొందరు కామెంట్‌ చేస్తే, జాబ్‌ వెతుక్కునే పద్ధతి ఇది కాదంటూ మరికొందరు విమర్శించారు. 


పరాస్ చోప్రా 2009లో వింగిఫై సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ప్రారంభించారు. దిల్లీ కేంద్రంగా ఇది పని చేస్తుంది. పరాస్ చోప్రా ఫోర్బ్స్ 30 అండర్ 30 లిస్ట్‌లో రెండుసార్లు చోటు సంపాదించారు. VWOను కూడా పరాస్ చోప్రా స్థాపించారు.


యాంటీమెటల్ (Antimetal) CEO మాథ్యూ పార్క్‌హర్స్ట్‌కు కూడా ఇదే రకమైన అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి, ఇంటర్న్‌షిప్ కోసం రెజ్యూమ్‌తో పాటు పిజ్జా కూడా పంపాడు. ఇంటర్న్‌షిప్ కోసం మీ టీమ్‌కి ఇది నా నుంచి లంచం అని రాశాడు.


మరో ఆసక్తికర కథనం: ఎఫ్‌డీ మీద ఎక్కువ వడ్డీ కావాలా?, టాప్‌ లిస్ట్‌లో 8 బ్యాంకులు