Nitin Gadkari: 


డీజిల్‌ కార్ల ఉత్పత్తిని తగ్గించాలని కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ సూచించారు. కంపెనీలు తమ మాట వినకపోతే కాలుష్య పన్ను విధిస్తామని హెచ్చరించారు. డీజిల్‌ ఇంజిన్‌ వాహనాలపై 10 శాతం అదనపు జీఎస్టీ అమలు ప్రతిపాదనను ఇప్పటికే ఆర్థిక శాఖకు సమర్పించామని పేర్కొన్నారు. 63వ సియామ్‌ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు.


'డీజిల్‌ ఇంజిన్‌ వాహనాల ఉత్పత్తిని తగ్గించాలని పరిశ్రమ వర్గాలను కోరుతున్నాను. ఒకవేళ ఆ పని చేయకుంటే అదనపు పన్ను విధించక తప్పదు' అని నితిన్‌ గడ్కరీ అన్నారు. 'డీజిల్‌ వాహనాలను తగ్గించాలని నేనెప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు గనక తగ్గించకపోతే మేం అదనపు పన్నులు విధిస్తాం. మీరు డీజిల్‌ వాహనాలు అమ్ముకోవడం కష్టమయ్యేంత మేరకు పన్నులు పెంచుకుంటూ వెళ్తాం' అని ఆయన తెలిపారు.


భారత మార్కెట్లో 2014 నుంచి డీజిల్‌ వాహనాల విక్రయం తగ్గిపోయింది. ఇంధన ధరలు పెరగడమే ఇందుకు కారణం. స్థానిక మార్కెట్లో 2014 ఆర్థిక ఏడాదిలో 53 శాతంగా ఉన్న ప్యాసెంజర్‌ వెహికల్స్‌ విక్రయాలు గతేడాది 18 శాతానికి తగ్గిపోయాయి. అయితే మరో పది శాతం పరోక్ష పన్ను అమలు చేయడం వల్ల డీజిల్‌ వాహనాల అమ్మకాలపై ప్రభావం చూపనుంది.  క్రూడాయిల్‌ దిగుమతులు, కాలుష్యం తగ్గించేందుకు కంపెనీలు ఎలక్ట్రిక్‌, ఇతర టెక్నాలజీ వాహనాలపై దృష్టిసారించాలని గడ్కరీ సూచించారు. 'అదనపు పన్ను విధిస్తే వాహనాల విక్రయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది' అని ఎం అండ్‌ ఎం కంపెనీ తెలిపింది.


గడ్కరీ వ్యాఖ్యల నేపథ్యంలో ఎం అండ్‌ ఎం, టాటా మోటార్స్‌, మారుతీ సుజుకీ వంటి వాహన కంపెనీల షేర్లు పతనమయ్యాయి. 2021లోనూ డీజిల్‌ వాహనాలపై గడ్కరీ మాట్లాడారు. ప్రొడక్షన్‌ తగ్గించాలని కంపెనీలకు సూచించారు. ఇతర టెక్నాలజీపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.


ఎనర్జీ ట్రాన్స్‌సిషన్‌ అడ్వైజరీ కమిటీ ఈ మే నెలలో ఇలాగే స్పందించింది. 2027 చివరికల్లా పది లక్షల జనాభా కన్నా ఎక్కువగా ఉండే పట్టణాల్లో డీజిల్‌ వాహనాలను నిషేధించాలని సూచించింది.


స్టాక్ మార్కెట్ అప్ డేట్


భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఒక్కసారిగా కుదుపునకు గురయ్యాయి. ఉదయం భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం కాస్త తేరుకోవడంతో మదుపర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. మధ్యాహ్నం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 20 పాయింట్లు తగ్గి 19,975 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 75 పాయింట్లు పెరిగి 67,202 వద్ద కొనసాగుతున్నాయి. ఐటీ షేర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.