AJIO Scam: మన దేశంలో టెక్నాలజీ, సోషల్‌ మీడియా వ్యాప్తి పెరుగుతున్న కొద్దీ కొత్త మోసాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కేటుగాళ్లు చాలా తెలివిగా జనాన్ని టోకరా ఇస్తున్నారు, నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇలాంటి ఓ కేసులో దిల్లీ హైకోర్టు కూడా జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఈ కేసులో, ముకేష్ అంబానీ కంపెనీ పేరుతో భారీ స్థాయిలో మాయజేశారు మోసగాళ్లు. హైకోర్టు ఆదేశంతో దిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు.


రిలయన్స్‌కు చెందిన కంపెనీ పేరిట మోసం
దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముకేష్ అంబానీకి (Mekesh Ambani) చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, AJIO.com పేరుతో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను నడుపుతోంది. ఆజియో బ్రాండ్‌ మన దేశంలో చాలా మందికి సుపరిచితం. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు (Reliance Industries) చెందిన లైఫ్ స్టైల్ బ్రాండ్ ఇది. ఆజియో బ్రాండ్ పాపులారిటీని ఉపయోగించుకుని, కొందరు వ్యక్తులు ప్రజల్ని మోసం చేశారు. ఈ విషయం తెలియగానే, తమ బ్రాండ్‌ దుర్వినియోగం అవుతోందంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ కేసు పెట్టింది. విచారణ చేపట్టిన దిల్లీ హైకోర్టు.. ఈ కేసులో దర్యాప్తు చేయాలని, కేటుగాళ్ల గురించి కూపీ లాగాలని దిల్లీ పోలీస్‌ సైబర్ సెల్‌ను ఆదేశించింది.


ఈ స్కామ్ ఏంటి?
ఈ స్కామ్‌ ఆన్‌లైన్‌ వేదికగా జరుగుతోంది. సైబర్‌ నేరగాళ్లు, తాము ఆజియోలో పని చేస్తున్నామని చెబుతూ ప్రజలకు ఫోన్లు చేస్తున్నారు. తాము ఆజియో అధికారులమని, కంపెనీ మీకు స్పెషల్‌గా అద్భుతమైన ఆఫర్‌ ఇస్తోందని తియ్యటి మాటలు చెబుతారు. తాము సూచించిన బ్యాంక్‌ ఖాతాల్లో రూ. 5000 నుంచి 10 లక్షల వరకు డిపాజిట్ చేయమని అడుగుతారు. డబ్బును డిపాజిట్ చేస్తే, దానికి ప్రతిఫలంగా వారికి అంతకుమించిన విలువైన స్క్రాచ్ కూపన్లు, గిఫ్ట్‌ కార్డులు, ప్రైజ్ మనీ వంటి లభిస్తాయని అబద్ధపు హామీలు ఇస్తారు. ఈ విధంగా... ఆజియో, ఆజియో ఆన్‌లైన్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో జనం నుంచి డబ్బులు వసూలు చేశారు. జనాన్ని నమ్మించడానికి AJIO ట్రేడ్‌మార్క్‌ను, లోగోను కూడా ఉపయోగించుకున్నారు. 


ఈ స్కామ్‌ గురించి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ దృష్టికి వెళ్లింది. దీంతో... ఆజియో పేరిట మోసం చేస్తున్నారని, ట్రేడ్‌మార్క్‌ను, లోగోను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫిర్యాదు చేసింది. తన కంప్లైంట్‌లో, ఆరుగురు వ్యక్తులు, సంస్థలను నిందితులుగా చేర్చింది. మోసానికి పాల్పడుతున్న వ్యక్తులు కోల్‌కతాకు చెందిన వారని సమాచారం. మోసగాళ్లు ప్రజల ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.


దిల్లీ హైకోర్టు ఆదేశం
ఈ కేసులో మోసపూరిత కార్యకలాపాలను అడ్డుకునేందుకు అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను వెంటనే సీజ్‌ చేయాలని దిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అలాగే, సదరు ఖాతాలు తెరిచిన తేదీ నుంచి ఇప్పటి వరకు లావాదేవీల స్టేట్‌మెంట్ సమర్పించాలని సూచించింది. బ్యాంక్‌ అకౌంట్‌ KYC వివరాలు సహా అందుబాటులో ఉన్న అన్ని  పేపర్లు, సాక్ష్యాలను సమర్పించాలని చెప్పింది. నిందితులు ఉపయోగించిన మొబైల్ నంబర్లను వెంటనే బ్లాక్ చేయాలని టెలికాం కంపెనీలను కూడా దిల్లీ హైకోర్టు ఆదేశించింది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial