2000 Rupee Notes Exchange: డబ్బుకు సంబంధించి అత్యంత కీలకమైన గడువు ముంచుకొస్తోంది. మీ దగ్గర 2000 రూపాయల నోట్లు ఉంటే, మీరు ఇంకా ఆ నోట్లను మార్చుకోకపోతే లేదా వాటిని మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయకపోతే తక్షణం ఆ పని చూడండి. మీకు ఇంకా 3 రోజుల సమయం మాత్రమే మిగిలుంది. బీరువాలోని బట్టల కింద, సొరుగుల్లో, పాత దుస్తుల జేబుల్లో, పాత వాలెట్స్‌లో, దేవుడి హుండీలో, పటాల వెనుక, పోపుల డబ్బాల్లో, ఇంకా ఎక్కడైనా పింక్‌ నోట్లు (రూ.2 వేల నోట్లు) పెట్టి మర్చిపోయారేమో ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ నెలాఖరు (30 సెప్టెంబర్ 2023) లోగా రూ. 2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకోకపోతే లేదా అకౌంట్‌లో డిపాజిట్ చేయకపోతే ఆ డబ్బు వృథా అయ్యే అవకాశం ఉంది. 


తిరిగి రాని రూ.24,000 కోట్లు
ఇంతలా ఎందుకు చెబుతున్నామంటే, మార్కెట్‌లో చలామణీలో ఉన్న వేల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు ఇంకా బ్యాంకుల వద్దకు తిరిగి రాలేదు. రిజర్వ్‌ బ్యాంక్‌ లెక్క ప్రకారం ప్రజల వద్ద ఉన్న ఇప్పటికీ రూ. 24 వేల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు మిగిలి ఉన్నాయి.


2023 మే 19న 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‍‌(RBI) ప్రకటించింది. RBI లెక్క ప్రకారం... 2023 మార్చి 31 వరకు మార్కెట్‌లో రూ. 3.62 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు చెలామణీలో ఉన్నాయి. 2023 మే 19 నాటికి ఈ మొత్తం రూ. 3.56 లక్షల కోట్లకు తగ్గింది.


చివరిసారిగా, ఈ నెల ప్రారంభంలో (2023 సెప్టెంబర్ 1న), నోట్ల విత్‌డ్రాకు సంబంధించిన డేటాను RBI విడుదల చేసింది. అప్పుడు చెప్పిన లెక్కల ప్రకారం, రూ. 3.32 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయి. అంటే చెలామణిలో ఉన్న మొత్తం నోట్లలో 93 శాతం వెనక్కు వచ్చాయి. మిగిలిన 7 శాతం, అంటే రూ. 24,000 కోట్ల విలువైన రూ. 2000 నోట్లు ఇంకా తిరిగి రావాల్సి ఉంది.


రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సమయంలో, రూ.2000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్‌ కోసం 2023 సెప్టెంబర్ 30 వరకు గడువు (last date for exchange or deposit of 2000 rupee notes) ఇచ్చిన ఆర్‌బీఐ, సెప్టెంబరు 30 తర్వాత బ్యాంకులు రూ.2000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్లను స్వీకరిస్తాయో, లేదో వెల్లడించలేదు. సెప్టెంబర్ 30, 2023లోగా రూ.2000 నోట్లను మార్చుకోవాలని లేదా డిపాజిట్ చేయాలని మాత్రం ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేస్తోంది.


సెప్టెంబర్‌ 30 తర్వాత పింక్‌ నోట్లు చెల్లవా?
సెప్టెంబరు 30 వరకు 2,000 డినామినేషన్ నోట్లు లీగర్‌ టెండర్‌గా (చట్టబద్ధమైన కరెన్సీగా)‌ కొనసాగుతుంది. సెప్టెంబరు 30 గడువు తర్వాత ఆ నోట్లను రద్దు చేయాలని తాను ప్రభుత్వాన్ని కోరతానో, లేదో తనకు ఖచ్చితంగా తెలియదని, రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.


ప్రస్తుతం ఉన్న రూ.2,000 నోట్లలో 89 శాతాన్ని 2017 మార్చికి ముందు జారీ చేశారు. వాటి అంచనా జీవిత కాలం నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు. ఆ గడువు ఇప్పుడు ముగింపులో ఉంది. సెంట్రల్ బ్యాంక్ ప్రింటింగ్‌ ప్రెస్‌లు 2018-19లోనే 2,000 నోట్ల ముద్రణను నిలిపేశాయి.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial