Twitter Subscription Hike:
ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడు! ఐఫోన్ యూజర్లకు షాకివ్వబోతున్నాడని సమాచారం. ఇప్పుడున్న ట్విటర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ రేటును పెంచబోతున్నాడని తెలిసింది. ప్రస్తుతం ఐఫోన్ యాప్ ద్వారా బ్లూటిక్ కొనుగోలు చేస్తే 7.99 డాలర్లు వసూలు చేస్తున్నారు. ఇకపై దానిని 11 డాలర్లకు పెంచుతారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వెబ్‌సైట్ ద్వారా తీసుకుంటే 7 డాలర్లు చెల్లిస్తే సరిపోతుందట.
యాపిల్‌కు అడ్డుకట్ట వేసేందుకే ఎలన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకుంటున్నాడని తెలిసింది. ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో యాప్స్ ద్వారా ఎలాంటి పేమెంట్లు చేసినా యాపిల్ కార్పొరేషన్ 30 శాతం డబ్బు కట్ చేస్తుండటమే ఇందుకు కారణం. వెబ్‌సైట్లో ధరను తగ్గించేందుకూ ఓ వ్యూహం ఉందట. యూజర్లు ఐఫోన్ యాప్‌లో సైనప్ కాకుండా వెబ్‌సైట్‌ను ఎక్కువ విజిట్ చేసేందుకు ఇది దోహదం చేస్తుందని అంటున్నారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ యాప్స్‌లో ధరలు మారుస్తారో లేదో కంపెనీ చెప్పలేదు.
మైక్రో బ్లాగింగ్ కంపెనీ ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఎలన్ మస్క్ అనేక మార్పులు చేస్తున్నాడు. వ్యక్తులు, కంపెనీలు, ప్రభుత్వాలకు ట్విటర్ వెరిఫైడ్ సేవలకు వేర్వేరు రంగులతో టిక్స్ ఇచ్చాడు. రిపబ్లిక్ పార్టీ ముఖ్యనేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తిరిగి తీసుకొచ్చాడు. భావ ప్రసార స్వేచ్ఛకు అండగా నిలుస్తున్నాడు. ఎన్నికల సమయంలో డెమొక్రటిక్ పార్టీ నేతలు ట్విటర్‌ను ఎలా వాడుకున్నారో, ఓటర్లను ఎలా ప్రభావితం చేశారో ట్వీట్లు చేస్తున్నాడు.
కొన్ని రోజులుగా యాపిల్ కార్పొరేషన్ చర్యలను ఎలన్ మస్క్ విమర్శిస్తున్నాడు. సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు 30 శాతం ఫీజు విధించడం సహా చాలా వాటిని వ్యతిరేకిస్తున్నాడు. యాపిల్‌కు కమిషన్ ఇవ్వడం కంటే యుద్ధానికి వెళ్తాను అన్నట్టుగా మీమ్ పంచుకున్నాడు. అవసరమైతే యాపిల్‌కు పోటీగా మొబైల్ తయారీ కంపెనీ పెడతానని బెదిరించాడు. కాగా గతవారం టిమ్ కుక్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యాడు. యాపిల్ స్టోర్ నుంచి ట్విటర్‌ను తొలగించడంపై వచ్చిన విభేదాలను పరిష్కరించుకున్నాడని తెలిసింది.
Also Read: పన్ను పడని ఫండ్లు - ఈ ఏడాది బెస్ట్ టాక్స్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్లు ఇవే!
Also Read: సర్‌ప్రైజ్! హైదరాబాద్‌తో పోలిస్తే సంగారెడ్డిలో 47% పెరిగిన ఇళ్ల ధరలు - ఏంటీ రీజన్!