Gujarat Election Results 2022:
ధీమాగా ఉన్న ఆప్..
గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయం. అయితే...ఎప్పుడూ లేనంతగా...ఈ సారి ఎన్నికలు చాలా ఆసక్తికరంగా సాగాయి. అందుకు కారణం...ఆప్ ఎంట్రీ ఇవ్వడం. బీజేపీని ఢీకొట్టేందుకు బరిలోకి దిగారు కేజ్రీవాల్. విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ప్రతి సభలోనూ బీజేపీని టార్గెట్ చేశారు. బీజేపీ అనడం కన్నా...మోడీని టార్గెట్ చేశారనేది కరెక్ట్. ఒకానొక సందర్భంలో...కేజ్రీవాల్‌ను ప్రధాని అభ్యర్థిగానూ ప్రచారం చేశాయి ఆ పార్టీ వర్గాలు. కేంద్రంలో ఎదురులేకుండా దూసుకుపోతున్న బీజేపీని అడ్డుకునే సత్తా ఆప్‌నకు ఉందని చాలా ధీమాగా చెప్పారు కేజ్రీవాల్. అయితే...ఇప్పుడు గుజరాత్ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే ఆప్ ఏ ప్రభావమూ చూపించే పరిస్థితి లేదు. 100 సీట్లలో గెలుస్తామని మొదటి నుంచీ క్లెయిమ్ చేసుకుంది ఆప్. కానీ...ఇప్పుడు ఫలితాలు అలా లేవు. 5 చోట్ల మాత్రమే లీడ్‌లో ఉంది. అయినా... హ్యాపీగానే ఉంది ఆప్. అందుకు కారణం...మొట్టమొదటి సారి రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసి ఆ మాత్రం సీట్లు గెలుచుకోవడం గొప్ప విషయమే
అని చెబుతోంది. అంతే కాదు. కనీసం 15-20% ఓటు షేర్ సాధించినా అది గొప్పేనని అంటోంది. ఆప్ ఇంత ధీమాగా ఉండటానికి కారణం... అంతకు ముందు పంజాబ్ ఎన్నికల ఫలితాలే. పంజాబ్‌లో తొలిసారి పోటీ చేసి..20 చోట్ల విజయం సాధించింది ఆప్. ఆ తరవాత జరిగిన ఎన్నికల్లో ఏకంగా ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసింది. "మొదట ఉనికి చాటుకుందాం. ఆ తరవాత ఎలా గెలవాలో ఆలోచిద్దాం" అనే వ్యూహాన్ని
అనుసరిస్తోంది ఆమ్‌ఆద్మీ పార్టీ. అందుకే...గుజరాత్ విషయంలో పెద్దగా బాధ పడట్లేదు. ఇప్పుడు 5 సీట్లు గెలుచుకున్నా...వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో పార్టీని బలపరుచుకోటానికి అవకాశం దక్కుతుంది.
మరో మోడీలా..
కాస్త అతిశయోక్తిగా అనిపించినా...పంజాబ్ ట్రెండ్‌నే గుజరాత్‌లోనూ ఆప్ కొనసాగిస్తే...నరేంద్ర మోడీ తరహాలోనే కేజ్రీవాల్ చరిష్మా పెరగక పోదు. అంటే..."కేజ్రీవాల్ కొత్త మోడీ"లా అవతరించినా ఆశ్చర్యపోనవసరం లేదు. నిజానికి...దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ విజయం సాధించడానికి కారణం...నరేంద్ర మోడీ. ఆయన చరిష్మా అలా పార్టీకి బూస్టప్ ఇస్తోంది. ఫలితంగా...ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోట కూడా బీజేపీకి పెద్దగా నష్టం జరగడం లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా నిలబడి ఇంకా ఎక్కువ సీట్లు సాధించగలిగితే...కేజ్రీవాల్ కూడా తన చరిష్మా ఆధారంగా ఎన్నికలను ప్రభావితం చేయగలిగే స్థాయికి చేరుకునే అవకాశాలు లేకపోలేదు. ఆప్‌నకు ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రాధాన్యత దక్కలేదని అర్థమవుతోంది. గుజరాత్ ఓటర్లు ఆప్‌ను "థర్డ్ ఆప్షన్"గా భావించి ఉండొచ్చు. అయితే...ఢిల్లీ, పంజాబ్‌లలో తొలిసారి పోటీ చేసినప్పుడు ఆప్ ఇలాగే వెనకబడింది. కానీ...ఉనికిని మాత్రం కాపాడుకోగలిగింది. 2015లో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకుని కూడా కొల్లగొట్టి విజయం సాధించింది ఆప్. ఆ తరవాత 2020లో జరిగిన ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు గుజరాత్‌లోనూ వచ్చే ఎన్నికల్లో ఆ స్థాయి
ప్రభావం చూపించగలం అన్న ధైర్యంతో ఉన్నారు కేజ్రీవాల్.
Also Read: Gujarat Results 2022: ఇక జాతీయ పార్టీగా 'ఆమ్ఆద్మీ'- కేజ్రీవాల్ కల నెరవేరిందిగా!