బిలియనీర్ ఎలాన్ మస్క్ అనుకున్నంత పని చేసేలా కనిపిస్తున్నారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రకటించిన 10 రోజుల తర్వాత కీలక సానుకూల పరిణామం జరిగింది. సోమవారం ఉదయం టెస్లా సీఈఓతో ట్విట్టర్ బోర్డు చర్చలు జరిపినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
ఎలాన్ మస్క్‌తో ఒప్పందం కుదిరితే ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలు, కాల వ్యవధి, ఖర్చులు వంటి కీలక అంశాలపై ఇరువర్గాలు చర్చించినట్లు తెలుస్తోంది.
భారీ ఆఫర్
10 రోజుల క్రితం ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు 46.5 బిలియన్ డాలర్ల ఆఫర్ ఇచ్చారు ఎలాన్ మస్క్. తొలుత ఈ ప్రతిపాదనను ఎవరూ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. ట్విట్టర్ బోర్డు కూడా తాము కంపెనీని విక్రయించే ప్రసక్తే లేదని చెప్పింది.
వెనక్కితగ్గిన ట్విట్టర్
ట్విట్టర్ ఒప్పుకోకపోయినా ఎలాన్ మస్క్ మాత్రం తన ప్రయత్నాలు మానుకోలేదు. చివరకు లావాదేవీకి కావాల్సిన నిధుల్ని కూడా సిద్ధం చేసుకున్నారు. కొనుగోలు సౌలభ్యం కోసం హోల్డింగ్ కంపెనీని కూడా రిజిస్టర్ చేయించారు. మస్క్ ముమ్మర ప్రయత్నాలకు ట్విట్టర్ కూడా సానుకూలంగా స్పందించాల్సి వచ్చింది. అంతేగాక, 'పాయిజన్ పిల్' వ్యూహంతో అడ్డుకట్ట వేయాలనకున్న యత్నాలన్నింటినీ ట్విట్టర్ దాదాపు పక్కన పెట్టేసింది.
షేర్‌హోల్డర్లు కూడా ఒత్తిడి తేవడంతో ట్విట్టర్ బోర్డు ఆదివారం సమావేశమైంది. ఆ తర్వాత సోమవారం తెల్లవారుజామున మస్క్‌తో ట్విట్టర్బోర్డు సమావేశమై ఒప్పందంపై చర్చించినట్లు తెలుస్తోంది. మస్క్ ఒక్కో ట్విట్టర్ షేరుకు 54.20 డాలర్ల చొప్పున 43 బిలియన్ డాలర్లు చెల్లించడానికి సిద్ధమయ్యారు.
షేర్లు రయ్‌రయ్
ఎలాన్ మస్క్‌తో ట్విట్టర్ ఒప్పందం దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తోన్న వేళ సంస్థ షేర్లు రయ్‌రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ప్రీ మార్కెట్ ట్రేడింగ్‌లో ట్విట్టర్ షేర్లు 4 శాతం ఎగబాకాయి. మరి ఈ వార్తలు నిజమైతే ట్విట్టర్ షేర్లు ఇంకెంత దూసుకెళ్తాయో చూడాలి. మస్క్ ఇచ్చిన ఆఫర్‌కు ట్విట్టర్ ఓకే చెప్పేలానే కనిపిస్తోంది.
Also Read: Hanuman Chalisa Row: ప్రధాని మోదీని తాకిన హనుమాన్ చాలీసా ఎఫెక్ట్
Also Read: World Oldest Person Died: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత- వయసెంతంటే?