ఐపీఎల్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధం అయింది. సోమవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం రెండు జట్లకూ ఎంతో అవసరం.


ఐపీఎల్‌లో ఇప్పటివరకు రెండు జట్ల ప్రదర్శన ఆశాజనకంగా లేదు. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ఎనిమిదో స్థానంలోనూ, చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిదో స్థానంలోనూ ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి ఆరు పాయింట్లతో ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు మాత్రమే సాధించింది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే రెండు జట్లకూ ఈ మ్యాచ్ కీలకమే.


ఈ సీజన్‌లో రెండు జట్ల మధ్య ఇప్పటికే ఒక మ్యాచ్ జరిగింది. ఏప్రిల్ 3వ తేదీన జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఏకంగా 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 18 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌట్ అయింది.


ఆ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ (4: 2 బంతుల్లో, ఒక ఫోర్), భనుక రాజపక్స (9: 5 బంతుల్లో, ఒక సిక్సర్) ప్రారంభంలోనే అవుటయ్యారు. దీంతో పంజాబ్ 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.


శిఖర్ ధావన్‌తో (33: 24 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), లియాం లివింగ్‌స్టోన్ (60: 32 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు) స్కోరును ముందుకు నడిపించారు. వీరు వేగంగా ఆడటంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి ఏకంగా 72 పరుగులు సాధించింది. మూడో వికెట్‌కు 52 బంతుల్లోనే 95 పరుగులు జోడించాక బ్రేవో బౌలింగ్‌లో ధావన్ అవుటయ్యాడు. లివింగ్‌స్టోన్‌ను కూడా జడేజా అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన వారిలో ఎవరూ నిలుదొక్కుకోకపోవడంతో పంజాబ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 180 పరుగులకే పరిమితం అయింది.


ఇక 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై లక్ష్యం దిశగా సాగలేదు. ఎనిమిది ఓవర్లలో 36 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శివం దూబే (57: 30 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు), మహేంద్ర సింగ్ ధోని (23: 28 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) చెన్నైని ఆదుకున్నారు. అయితే వేగంగా ఆడే ప్రయత్నంలో దూబే అవుట్ కావడం, ఇంకెవరూ వేగంగా ఆడలేకపోవడంతో చెన్నై 18 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌట్ అయింది.


మరి నేటి మ్యాచ్‌లో ఎవరు గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్తారో చూడాలి. చెన్నై సూపర్ కింగ్స్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుంది. పంజాబ్ కింగ్స్ మాత్రం మూడు మార్పులు చేసింది.


చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు
రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్), ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), శివం దూబే, డ్వేన్ బ్రేవో, క్రిస్ జోర్డాన్, డ్వేన్ ప్రిటోరియస్, ముకేష్ చౌదరి


పంజాబ్ కింగ్స్ తుదిజట్టు
మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియాం లివింగ్ స్టోన్, రిషి ధావన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), భనుక రాజపక్స, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడ, రాహుల్ చాహర్, సందీప్ శర్మ