Tomato memes:
రెండు వారాల క్రితం కిలో టమాట ఐదు రూపాయలు పెట్టి తీసుకున్నాం! ఇప్పుడు అదే టమాటను రెండు రోజులు నుంచి రూ.100-120 పెట్టి కొనాల్సి వస్తోంది. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు! ఇంతింత ధరలు పెట్టి ఎలా కొనుగోలు చేయగలమని వాపోతున్నారు!
బెంగళూరు, ముంబయి, చెన్నై, కోల్‌కతా, దిల్లీ, అహ్మదాబాద్ వంటి నగరాల్లో టమాట ధర రూ.100-120 వరకు పలుకుతోంది. హోల్‌సేల్ మార్కెట్లోనే రూ.60-70 పెట్టి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కమిషన్లు, ఖర్చులు అన్ని కలిపి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. అందుకే పెరిగిన టమాట ధరలపై ప్రజలు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. మీమ్స్ పంచుకుంటున్నారు. కొందరు ట్విటర్లో #TomatoPrices హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
'మోదీజీ దగ్గర టన్నుల కొద్దీ టమాటా సూప్ ఉంది. అందుకే ధరలు పెరిగాయి' అంటూ రాహుల్ గాంధీ చిత్రాలతో కూడిన మీమ్స్‌ను కొందరు వదిలారు. 'టమాట ధర రూ.100కు చేరుకుంది. అయితే నేను ఎక్కువ టమాటలు తిననుగా' అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రాలతో మరికొందరు మీమ్స్ పంచుకుంటున్నారు. 'కిలో టమాట 140 రూపాయాలు. కిలో యాపిల్ పండ్లు 140' అని బోర్డులున్న చిత్రాలను కొందరు ట్వీట్ చేస్తున్నారు. మరికొందరేమో టమాట డిజైన్లలో చెవి రింగులు, చెవిపోగులు వచ్చాయంటూ షేర్ చేస్తున్నారు.
టమాట ధరలు ఒక్కసారిగా పెరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వేసవిలో ఎండలు బాగా ఉండటంతో టమాట ఉత్పత్తి విపరీతంగా తగ్గిపోయింది. ఇదే సమయంలో రుతుపవనాలు ఆలస్యంగా రావడం కొంప ముంచింది. కొన్నాళ్లు కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవడం కిలో రూ.3-4 కు దొరికాయి. అయితే ఒక్కసారిగా కురిసిన వర్షాలతో కొన్ని రాష్ట్రాల్లో టమాట మొక్కలు కొట్టుకుపోయాయి. వైర్లకు కట్టి పెంచుతున్నవి మాత్రమే నిలబడ్డాయి.
హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఎగుమతి తగ్గిపోవడంతో దిల్లీలో టమాట ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పుడు బెంగళూరు నుంచి అక్కడికి సరఫరా చేస్తున్నారు. ఫలితంగా ఈ మెట్రో నగరంలో ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. ఎరువులు, పురుగుల మందుల ధరలు పెరగడంతోనూ కొందరు రైతులు పంటలు అస్సలు వేయడం లేదు. మహారాష్ట్రలో ఉత్పత్తి తగ్గడంతో గుజరాత్, రాజస్థాన్, కోల్‌కతాలో ధరలు ఎగిశాయి. హిమాచల్ ప్రదేశ్‌లో కురిసిన వర్షాలు దిల్లీ మార్కెట్‌పై ప్రభావం చూపించాయి.
ఇప్పటికే సెంచరీ కొట్టిన టమాట ధర ఇంతకన్నా పెరిగే అవకాశం లేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. కొన్ని రోజుల వరకు ఇదే స్థాయిలో ఉంటుందని పేర్కొంటున్నాయి. వర్షాలు సక్రమంగా కురిసి, వరదలు రాకుండా ఉంటే రెండు నెలల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని వెల్లడించాయి. గతేడాది టమాట తక్కువ ధర పలకడంతో ఎక్కువ లాభం వస్తున్న బీన్స్ వైపు రైతులు మళ్లారని తెలిసింది. కాగా హైదరాబాద్ మార్కెట్లో ఇప్పటికీ చాలా చోట్ల కిలో టమాట రూ.70-80 దొరుకుతోంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పెరిగిపోయిన కూరగాయల ధరలు - సామాన్యులకు చుక్కలు!