Tech Lay-offs: ఆర్థిక మాంద్యం భయాలతో ఇటీవలి నెలల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. గూగుల్ (ఆల్ఫాబెట్), మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలు కూడా వేల సంఖ్యలో సిబ్బందిని తీసేస్తున్నట్లు ఇటీవల ప్రకటించాయి.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం... 2023 జనవరి 20న, Google CEO సుందర్ పిచాయ్ లే-ఆఫ్స్ గురించి తన ఉద్యోగులకు ఒక ఈ-మెయిల్ పంపారు. వర్క్‌ఫోర్స్‌ను తగ్గించడానికి వివిధ విభాగాల నుంచి 12,000 మంది ఉద్యోగులను Google తొలగిస్తోంది.
ఒక డేటా ప్రకారం, 'భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజూ 3000 మంది తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. కొన్ని ప్రధాన టెక్ కంపెనీలు పెద్ద సంఖ్యలో తొలగింపులను ప్రకటించినందున, రాబోయే కాలంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారవచ్చు'.
ఈ పరిస్థితుల్లో... కంపెనీలు ఇంత వేగంతో ఉద్యోగులను ఎందుకు తొలగిస్తున్నాయి, భారతదేశ ప్రజలను ఎంత వరకు ప్రభావితం చేస్తుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఎవరికి ఎక్కువ?
పట్నా యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ వినయ్‌తో ABP మాట్లాడింది. ఈ సంవత్సరం టెక్ కంపెనీలకు బాగోలేదని ఆయన చెప్పారు. గ్లోబల్ మాంద్యం భయాల వల్ల ఇంకా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తాయని వెల్లడించారు. ముఖ్యంగా, కాంట్రాక్ట్‌పై పని చేస్తున్నవాళ్లు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడల్లా, కాంట్రాక్ట్ ఉద్యోగుల మీదే తొలి వేటు పడుతుంది.
మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్, తన కంపెనీ నుంచి 11,000 మంది ఉద్యోగులను తొలగించడానికి కారణం పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వడమే. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగులు అనారోగ్యానికి గురయ్యారు. వాళ్ల గైర్హాజరీ వల్ల కంపెనీ పనితీరు ప్రభావితం కాకూడదు కాబట్టి, చాలా సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించాయి. ఇది కాకుండా, లాక్‌డౌన్ సమయంలో చాలా కంపెనీలు తమ డిజిటల్ మార్కెటింగ్‌ను కూడా పెంచాయి. దీని కోసం చాలా మందిని తీసుకున్నాయి.
ప్రొఫెసర్ వినయ్ ప్రకారం, లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ వర్క్‌కు పెరిగిన డిమాండ్ కారణంగా చాలా కంపెనీలు అవసరమైన దానికంటే ఎక్కువ మందిని నియమించుకున్నాయి. ఇప్పుడు మార్కెట్ క్షీణించింది. కాబట్టి, ఆర్థిక పరిస్థితిని తిరిగి బ్యాలెన్స్ చేయడానికి సిబ్బందిని తొలగిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం ఆందోళనల మధ్య తమ ఖర్చులను తగ్గించుకోవడానికి కూడా కంపెనీలు నిరంతరం తొలగింపులు చేస్తున్నాయి.
2023లో ఎన్ని ఉద్యోగాలు పోయాయి?
2023 జనవరిలో ఇప్పటి వరకు, 166 టెక్ కంపెనీలు 65,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. మైక్రోసాఫ్ట్‌లోని 10,000 మంది ఉద్యోగులను తొలగించడానికి ముందు, అమెజాన్ 1000 మంది భారతీయ ఉద్యోగులు సహా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 18000 మందిని కంపెనీ నుంచి పంపేసింది. ఉద్వాసనలు పలికిన కంపెనీల్లో భారత స్టార్టప్‌లు అత్యధికంగా ఉన్నాయి. షేర్‌చాట్ కంపెనీ తన వర్క్‌ఫోర్స్‌లో 20 శాతం లేదా 500 మంది ఉద్యోగులను తొలగించింది.
లే-ఆఫ్ ట్రాకింగ్ సైట్ Layoffs.fyi డేటా ప్రకారం... 2022లో, 1,000కి పైగా కంపెనీలు 1,54,336 మంది ఉద్యోగులను తొలగించాయి.
ఐటీ రంగ దిగ్గజం విప్రో తాజాగా 400 మందికి పైగా కొత్త ఉద్యోగులకు పింక్ స్లిప్స్ ఇచ్చింది.
ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ 380 మంది ఉద్యోగులను తొలగించింది.
మెడిబడ్డీ డిజిటల్ హెల్త్‌కేర్ కంపెనీ తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 8 శాతం లేదా 200 మందిని తొలగించింది.
ఓలా 200 మంది ఉద్యోగులను, డన్జో 3 శాతం, సోఫోస్ 450 మంది ఉద్యోగులను ఇళ్లకు పంపాయి.
భారత్‌పై ప్రభావం ఎలా ఉంటుంది?
భారతదేశంలో నిరుద్యోగ సమాచారాన్ని 'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ' విడుదల చేసింది. ఆ డేటా ప్రకారం... 2022 డిసెంబర్ నెలలో మన దేశంలో నిరుద్యోగిత రేటు 8.30 శాతానికి పెరిగింది. గత 16 నెలల్లో ఇదే అత్యధికం. వివిధ కంపెనీలు పెద్ద ఎత్తున చేపట్టిన తొలగింపులు దేశంలో నిరుద్యోగాన్ని మరింత పెంచుతున్నాయి.