Indias Most Valuable Brand Is TATA: ఐపీఎల్ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) స్పాన్సర్‌షిప్ కోసం ప్రపంచ స్థాయి కంపెనీలు పోటీ పడతాయి, వేల కోట్లు ఖర్చు చేస్తాయి. అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం వల్ల ఆయా కంపెనీలకు ఏంటి లాభం అన్న ప్రశ్నకు సమాధానం.. 'టాటా గ్రూప్ విలువ'. ఐపీఎల్‌ ద్వారా టాటా గ్రూప్‌ చాలా లాభపడింది. ఐపీఎల్‌లో టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించడం వల్ల టాటా బ్రాండ్ విలువ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా పెరిగింది.


బ్రాండ్‌ వాల్యూను పెంచుకోవడంలో టాటా గ్రూప్‌ రికార్డ్‌ సృష్టించింది. టాటా బ్రాండ్‌ విలువ పెరిగినంత వేగంగా మరే బ్రాండ్‌ వాల్యూ పెరగలేదు. వివిధ బ్రాండ్‌ల విలువపై పరిశోధన & సలహా సేవలను అందించే 'బ్రాండ్ ఫైనాన్స్‌' కంపెనీ ఈ విషయాలను వెల్లడించింది. ఆ కంపెనీ రిపోర్ట్‌ ప్రకారం.. 'ఇండియన్ ప్రీమియర్ లీగ్‌'‍ను ‌(Indian Premier League) స్పాన్సర్ చేయడం ద్వారా టాటా బ్రాండ్ విలువ 9 శాతం పెరిగింది. నివేదిక ప్రకారం, ఇప్పుడు టాటా బ్రాండ్ విలువ ‍(TATA Brand Value) 28.6 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఒక భారతీయ బ్రాండ్ విలువ దాదాపు 30 బిలియన్ డాలర్ల దగ్గరకు వెళ్లడం ఇదే తొలిసారి.


ఇన్ఫోసిస్ రెండో అత్యంత విలువైన బ్రాండ్
భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా నిలవడం ఇదే తొలిసారి కాదు, ఇప్పటికే ఆ ఘనతను సాధించింది. అయితే, ఇటీవలి 9 శాతం వృద్ధి వల్ల టాటా గ్రూప్‌ స్థానం మరింత పటిష్టంగా మారింది. ఇండియన్ మార్కెట్‌లో టాటా తర్వాత అత్యంత విలువైన బ్రాండ్ ఇన్ఫోసిస్ (Infosys). గత ఏడాది ఐటీ రంగం మందగించినప్పటికీ ఇన్ఫోసిస్ బ్రాండ్ విలువ (Infosys Brand Value) 9 శాతం పెరిగి 14.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 


తొలి రెండు బ్రాండ్ల మధ్య రెట్టింపు అంతరం
'బ్రాండ్ ఫైనాన్స్‌' రిపోర్ట్‌ ప్రకారం చూస్తే.. భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్‌గా ఫస్ట్‌ ర్యాంక్‌లో ఉన్న టాటా - రెండో ర్యాంక్‌లో ఉన్న ఇన్ఫోసిస్‌ బ్రాండ్ విలువల మధ్య రెట్టింపుపైగా అంతరం కనిపిస్తోంది. 14.2 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఇన్ఫోసిస్ బ్రాండ్‌ విలువ కంటే, 28.6 బిలియన్‌ డాలర్లతో నంబర్ వన్‌గా నిలిచిన టాటా బ్రాండ్ విలువ 101.41 శాతం ఎక్కువ.


దేశంలో మూడో విలువైన బ్రాండ్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
HDFC లిమిటెడ్ విలీనం తర్వాత HDFC బ్యాంక్ భారతదేశంలో మూడో అతి పెద్ద బ్రాండ్‌గా మారింది. ప్రస్తుతం, HDFC బ్యాంక్ బ్రాండ్ విలువ 10.4 బిలియన్‌ డాలర్లుగా 'బ్రాండ్ ఫైనాన్స్‌' అంచనా వేసింది.


పెద్ద IT కంపెనీల బ్రాండ్ విలువలు
ఐటీ రంగంలో బ్రాండ్ విలువ పరంగా... టాటా గ్రూప్‌లోని టీసీఎస్ (TCS Brand Value) 19.2 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉంది. హెచ్‌సీఎల్‌ టెక్ బ్రాండ్ విలువ (HCL Tech Brand Value) 16 శాతం పెరిగి 7.6 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. విప్రో బ్రాండ్‌ విలువ (Wipro Brand Value) 8 శాతం తగ్గి 5.8 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. టెక్ మహీంద్ర బ్రాండ్ విలువ (Tech Mahindra Brand Value) 10 శాతం తగ్గి 3.1 బిలియన్ డాలర్లకు దిగి వచ్చింది.


మరో ఆసక్తికర కథనం: ఆరోగ్య బీమా క్లెయిమ్స్‌లో కొత్త రూల్స్‌ - ఇన్సూరెన్స్‌ కంపెనీల ఆటలు చెల్లవు